రోహిత్, కోహ్లి జెర్సీలపై.. ‘పాకిస్థాన్’.. బీసీసీఐకి నిరసనల సెగ
మరికొన్ని గంటల్లో పాకిస్థాన్ లో చాంపియన్స్ ట్రోఫీ షురూ కానుంది. 8 ఏళ్ల తర్వా డిఫెండింగ్ చాంపియన్ అయిన పాకిస్థాన్ లో ఈ టోర్నీ జరగనుంది.
మరికొన్ని గంటల్లో పాకిస్థాన్ లో చాంపియన్స్ ట్రోఫీ షురూ కానుంది. 8 ఏళ్ల తర్వా డిఫెండింగ్ చాంపియన్ అయిన పాకిస్థాన్ లో ఈ టోర్నీ జరగనుంది. 12 ఏళ్ల విరామం అనంతరం ఓ ఐసీసీ ఈవెంట్ కు పాక్ ఆతిథ్యం ఇస్తోంది. కానీ, భారత మ్యాచ్ లు మాత్రం పూర్తిగా దుబాయ్ లో నే జరగనున్నాయి. అంటే.. లీగ్ మ్యాచ్ లతో పాటు మన జట్టు సెమీస్, ఫైనల్స్ కు చేరితే ఆ మ్యాచ్ లూ దుబాయ్ లోనే నిర్వహిస్తారన్నమాట.
వాస్తవానికి భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదని ముందే స్పష్టమైంది. పాకిస్థాన్ ఉగ్రవాదం విషయంలో అనుసరిస్తున్న ధోరణితో మన కేంద్ర ప్రభుత్వం ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంది. ఆటగాళ్ల భద్రత రీత్యా కూడా పాక్ వెళ్లడం సాధ్యం కాదని తేలిపోయింది. అయితే, 2023 వన్డే ప్రపంచ కప్ నకు పాక్ భారత దేశానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మన జట్టు రాకపోవడంతో పాక్ మండిపడింది. ఓ దశలో టోర్నీ జరుగుతుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమైంది. చివరకు ఐసీసీ జోక్యతో దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ ఇండియా సిద్ధమైంది.
గురువారం బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దీనికి సంబంధించి ఆటగాళ్ల కొత్త జెర్సీలను బీసీసీఐ ఆవిష్కరించింది. స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, మహమ్మద్ షమీ జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు. వీటిని బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది. ఇక్కడే అభ్యంతరాలు మొదలయ్యాయి.
జెర్సీలపై చాంపియన్స్ ట్రోఫీ లోగోలో పాకిస్థాన్ పేరుంది. దీంతో వాటిని ఎలా ధరిస్తారంటూ అభిమానులు నిలదీయడం మొదలుపెట్టారు. బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఆతిథ్య దేశం పేరు ఆటగాళ్ల జెర్సీలపై ఉండడం సహజం. మన జట్టు దుబాయ్ లో ఆడుతున్నా.. పాకిస్థాన్ అసలు ఆతిథ్య దేశం కావడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఆ దేశం పేరు ట్రోఫీ లోగోలోకి వచ్చింది.
విషయం ముదురుతుండడంతో బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదేశాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.