బీసీసీఐ ఎఫెక్ట్.. ‘వేగన్’ విరాట్ కు పర్సనల్ చెఫ్ కట్!

సూపర్ ఫిట్ నెస్ సాధించాలంటే తాను ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసిన కోహ్లి కఠినమైన డైట్ కు మారిపోయాడు. అలాంటివాడికి బీసీసీఐ తాజా నిబంధనలు ఇబ్బందిగా మారాయి.

Update: 2025-02-17 16:30 GMT

విరాట్ కోహ్లి.. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్ మన్. 2008లో 19 ఏళ్ల కుర్రాడిగా.. 2012లో పాతికేళ్ల యువకుడిగా.. 2016 నాటికి కంప్లీట్ ఫిట్ మ్యాన్ గా మారిన అతడి ప్రయాణం అద్భుతం.. ఓ దశలో దాదాపు ఫేడ్ అవుట్ అయిన కోహ్లి.. తన ‘స్థానం’ ఏమిటో గుర్తెరిగిన వాడు. 37 ఏళ్ల వయసులోనూ ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫిట్ నెస్ ఉన్న క్రికెటర్ ఎవరంటే కోహ్లినే..

దాదాపు దశాబ్దం కిందటే వేగన్ మారాడు కోహ్లి. వేగన్ అంటే.. శాకాహారాన్ని మించి.. పాలు, మాంసం సహా జంతువుల నుంచి వచ్చే ఏ పదార్థాన్నీ తీసుకోకపోవడం. సూపర్ ఫిట్ నెస్ సాధించాలంటే తాను ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసిన కోహ్లి కఠినమైన డైట్ కు మారిపోయాడు. అలాంటివాడికి బీసీసీఐ తాజా నిబంధనలు ఇబ్బందిగా మారాయి.

గత ఏడాది వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమ్ ఇండియా క్రికెటర్లకు బీసీసీఐ టెన్ కమాండ్ మెంట్స్ పేరిట పది మార్గదర్శకాలు నిర్దేశించిన సంగతి తెలిసిందే. వాటిని చాంపియన్స్ ట్రోఫీ నుంచే అమలు చేస్తోంది. కాగా, తటస్థ వేదిక దుబాయ్ చేరుకున్న టీమ్ ఇండియా ప్రాక్టీస్‌ ముమ్మరం చేసింది. విరాట్, కెప్టెన్ రోహిత్‌ శర్మతో పాటు ఇతర క్రికెటర్లూ నెట్స్‌ లో తీవ్రంగా సాధన చేశారు. టెన్ కమాండ్ మెంట్స్ లో భాగంగా ఆటగాళ్ల కుటుంబ సభ్యులకూ అనుమతి ఇవ్వలేదు. అంతేకాక.. వ్యక్తిగత చెఫ్‌ ను పెట్టుకునేందుకూ అవకాశం లేకుండా పోయింది.

అందరికీ ఒకరే చెఫ్..

టీమ్ ఇండియా మొత్తానికీ బోర్డు ప్రత్యేకంగా ఓ చెఫ్‌ ను కేటాయించిందట. అయితే, కఠిన డైట్ పాటించే కోహ్లి కోసం ఓ మార్గం కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం ప్రాక్టీస్‌ సందర్భంగా కోహ్లికి ప్యాకెట్ రూపంలో ఫుడ్ అందింది. సొంత చెఫ్‌ లేకపోవడంతో లోకల్ టీమ్‌ మేనేజర్‌ కు ఎలా చేయాలి? ఎలా ఉండాలని అని చెప్పి కావాల్సినవి తెప్పించుకున్నాడు. ఈ మేరకు బాగా పాపులర్ అయిన ఫుడ్ పాయింట్‌ నుంచి ప్యాకెట్లను తెచ్చి కోహ్లికి అప్పగించారట.

ప్రాక్టీస్ తర్వాత మిగతా క్రికెటర్లు కిట్ లు సర్దుకుంటుండగా కోహ్లి అక్కడే భోజనం చేశాడు. హోటల్ కు వెళ్లేటప్పుడు తినేందుకు కొన్ని బాక్స్ లు దాచుకున్నాడట.

Tags:    

Similar News