రికార్డులు అందుకుంటావనుకుంటే.. 'హ్యాట్రిక్ మిస్' చేశావా రోహిత్?
అలాంటిది 2013లో టోర్నీలో అతడిని ఓపెనర్ గా పంపాక వెనుక్కు తిరిగి చూసుకోలేదు.
చాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కెరీర్ మొత్తం గుర్తుండిపోతుంది. అసలు రోహిత్ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడంటే కారణం ఈ ట్రోఫీనే. 2013లో చాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్ ఓపెనర్ కాదు. మిడిలార్డర్ లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వచ్చేవాడు. అలాంటిది 2013లో టోర్నీలో అతడిని ఓపెనర్ గా పంపాక వెనుక్కు తిరిగి చూసుకోలేదు.
2013, 2017, 2025.. రోహిత్ ఇప్పుడు మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నాడు. అయితే, అతడు కెప్టెన్సీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. సారథిగా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో ఆడుతున్న రోహిత్ పలు రికార్డుల ముంగిట నిలిచాడు. అది మామూలు క్యాచ్ కాదు.. హ్యాట్రిక్ క్యాచ్ కావడం గమనార్హం.
స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో రోహిత్ తన చేతిలో పడిన క్యాచ్ ను నేలపాల్జేశాడు. దీంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. చేతితో గ్రౌండ్ ను బాదేస్తూ.. అసంతృప్తిని వెల్లడించాడు. అదే సమయంలో బౌలర్ అక్షర్ కూ సంకోచం లేకుండా సారీ చెప్పాడు.
ఈ క్యాచ్ పట్టి ఉంటే వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన చేతన్ శర్మ, కపిల్ దేవ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ సరసన అక్షర్ నిలిచేవాడు.
ఆ క్యాచ్ ఎంత విలువైనదంటే..
బంగ్లా ఇన్నింగ్స్ లో 9వ ఓవర్ వేసిన అక్షర్ రెండో బంతికే ఓపెనర్ తంజిద్ (25)ను ఔట్ చేశాడు. మరుసటి బంతికే సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (0)నూ పెవిలియన్ చేర్చాడు. ఈ రెండు క్యాచ్‌లను కీపర్ రాహుల్ పట్టాడు. వీరి తర్వాత వచ్చిన జకేర్ అలీ కూడా స్లిప్ లో క్యాచ్ ఇచ్చాడు. కానీ, రోహిత్ అందుకోలేదు. చివరి క్షణంలో బంతి చేజారింది. దీంతో అక్షర్ హ్యాట్రిక్ మిస్ అయింది. దీనికి సంజాయిషీగా అక్షర్‌కు రోహిత్ క్షమాపణలు చెబుతూ సైగలు చేశాడు.
ఈ మ్యాచ్ లో రోహిత్ మరో 12 పరుగులు చేస్తే.. వన్డేల్లో కోహ్లి తర్వాత అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. కోహ్లి 222 ఇన్నింగ్స్ లో 11 వేల పరుగులు చేశాడు. రోహిత్ కు ఇది 261వ ఇన్నింగ్స్.
సచిన్ (18,426), కోహ్లి (13,963), గంగూలీ (11,363) తర్వాత 11 వేల పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్ రోహిత్. సెంచరీలు, సిక్స్ ల పరంగానూ రోహిత్ ముందు పలు రికార్డులు ఉన్నాయి.
కొసమెరుపు: రోహిత్ క్యాచ్ వదిలేసినప్పుడు బంగ్లా స్కోరు 35/5. ఆ తర్వాత 6వ వికెట్ కు జాకెర్ అలీ, తౌఫిక్ మద్య 125పైగా పరుగుల భాగస్వామ్యం నమోదైంది.