ఈ విచిత్ర ఆకారాల వివరం తెలిసింది... శాస్త్రవేత్తల కీలక ప్రకటన!
చాలాకాలంగా గ్రహాంతరవాసులకు సంబంధించిన విషయాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
చాలాకాలంగా గ్రహాంతరవాసులకు సంబంధించిన విషయాలపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఏలియన్స్ ఉన్నాయని నమ్ముతుంటే.. చాలా మంది ఈ విషయాలను కొట్టిపారేస్తుంటారు.. ఈ భూమిపై మాత్రమే జీవం ఉందని నొక్కి చెబుతుంటారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు.
అవును.. దక్షిణ అమెరికాలోని పెరూలో దొరికిన విచిత్రమైన ఆకారంలో ఉన్నవాటికి సంబంధించి శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. 2017లో యూఫాలజిస్ట్ అయిన జైమీ మౌస్సాన్.. నజ్కా ఎడారిలోని ఓ గుహలో వీటిని డజన్ల కొద్దీ గుర్తించారు. ఆ సమయంలో.. అవి మనుషులకు సంబంధించినవి కావని.. గ్రహాంతర వాసులు కావొచ్చని కొంతమంది వాదించారు.
అయితే.. మరికొంతమంది మాత్రం ఈ వాదనను తప్పుబట్టారు. అసలు అవి మనుషులవీ కావు, గ్రహాంతరవాసులవీ కావని.. అవి కేవలం చెక్క బొమ్మలు కావొచ్చని అన్నారు. దీంతో.. అప్పటి నుంచి శాస్త్రవేత్తలు వాటిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ సమయంలో సుమారు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు.
ఈ సమయంలో... డాక్టర్ జోస్ జాల్స్ టీమ్.. ఈ మమ్మీల నోటిలోకి ప్రత్యేక కెమెరాలను పంపించింది. వాటిద్వారా లోపల ఎలా ఉందో గుర్తించింది. ఈ సమయంలో వాటి నోటి లోపల అమాల్గమ్ అనే ఒకరకమైన పాదరస మిశ్రమంతో నిండి ఉందని తేల్చిందట. అంతర్గత కంటి కండరాలకు సంబంధించిన డెసికేటెడ్ టిష్యూని గుర్తించినట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో.. పూర్తిగా ఎండిపోయిన ఆప్టిక్ నరాల అవశేషాలు కూడా వీటిలో కనిపించాయని బృందం తెలిపింది. ఈ కారణంగానే అవి చెక్క బొమ్మలు కావని.. ఇవి 100 శాతం అసలైనవని.. వీటికి ఒకప్పుడు ప్రాణం ఉండేదని డాక్టర్ జోస్ జాల్స్ బృందం స్పష్టం చేసింది. అయితే.. అవి ఒకప్పటి మనుషులవా.. ఏలియన్స్ వా అనేది తేలాల్సి ఉంది!
మరోపక్క శాస్త్రవేత్తల ప్రకటనతో జైమీ మౌస్సాన్ యాక్టివ్ అయ్యారని అంటున్నారు. ఈ సందర్భంగా.. కొన్ని డజన్ల మమ్మీలను తీసుకెళ్లి, మెక్సికో కాంగ్రెస్ లో చూపిస్తానని.. ఈ భూమిపై ఒకప్పుడు గ్రహాంతర వాసులు ఉన్నారనేందుకు ఇవే ఉదాహరణలు అని అంటున్నారు. వీటి డీఎన్ఏ 30 శాతం మనకు తెలియనిదని చెబుతున్నారు.
అందువల్ల కచ్చితంగా ఇవి మమ్మీలే అనేది ఆయన బలమైన అభిప్రాయంగా ఉందని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే అవి చెక్క బొమ్మలు కాదు.. ఒకప్పుడు ప్రాణంతో ఉన్న జీవులే అనే విషయం మాత్రం స్పష్టమైందని తెలుస్తోంది. అయితే.. అవి మనుషులా, ఏలియన్సా అనేది తెలియాల్సి ఉంది.