వామ్మో..హైదరాబాద్ బల్దియా బకాయిలు ఇన్ని కోట్లా?
వారు కోట్ల రూపాయలు కట్టకపోయినా వారికి సేవలు అందుతూనే ఉంటాయి.
దేశంలో పేదోళ్లకు, ఉన్నోళ్లకు తేడా ఎంతో ఉంటుందని మనకు తెలుసు. అధికారులు, పాలకులు ఉన్నోళ్లకు ఊడిగం చేస్తూ..పేదోళ్లను మాత్రం తమ బానిసలుగా భావిస్తూ ఉంటారు. దేశంలో ప్రజలందరూ పన్నులు కడితేనే పాలన సాగుతుంది. రోడ్లు వేయడం, భవనాలు కట్టడం, కరెంట్, ఇతర సౌకర్యాలు అన్ని పన్ను డబ్బులతోనే. అందుకే ప్రభుత్వాలు పన్నులు కట్టండి అంటూ అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాయి. అయితే ఈ అవగాహన ఒక్క పేదోళ్లకే అనిపిస్తుంటుంది. ఎందుకంటే నీతిగా, నిజాయితీ పన్నులు కట్టేది పేద, మధ్యతరగతి వాళ్లే. వీరు పన్నులు కట్టకుంటే కరెంట్ ఆపేస్తాం..తలుపులు పీక్కేళ్తాం..మంచినీటి నల్లా బంద్ చేస్తాం.. అంటూ అధికారులు హెచ్చరిస్తుంటారు. అయితే ధనవంతులకు ఇవన్నీ ఏవీ ఉండవు. వారు కోట్ల రూపాయలు కట్టకపోయినా వారికి సేవలు అందుతూనే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి బకాయిల లిస్ట్ పెడుతుంటారు. అవి చూస్తే మనం కంగుతినాల్సిందే..
తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాపర్టీ ట్యాక్స్(ఆస్తి పన్ను) వసూల్లకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. జీహెచ్ఎంసీకి కొంత మంది కోట్ల రూపాయల పన్నులు ఎగవేసినట్టు అధికారులు గుర్తించారు. అందులో కీలక సంస్థలు ఉండడం విస్తుగొలుపుతోంది. ఏళ్లుగా పన్నులు చెల్లించకపోవడంతో అవి కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు నిర్దారించారు. బకాయిల వసూలు కోసం స్పెషల్ డ్రైవ్ లో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయని చెబుతున్నారు అధికారులు.
ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించనవి వారికి నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఒక్క ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే 100 మందికి రెడ్ నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు. నోటీసులకు స్పందించకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తామని హెచ్చరించారు అధికారులు. రూ. 5లక్షలకు పైగా ఉన్న బకాయిల విలువ ఏకంగా రూ.860 కోట్లు. జూబ్లీహిల్స్ లాండ్ మార్క్ ప్రాజెక్ట్ బకాయి విలువ రూ.52 కోట్లు అని, ఎల్ అండ్ టీ మెట్రో రైలు బకాయి రూ.32 కోట్లు అని అధికారులు గుర్తించారు. హైదరాబాద్ అస్ బెస్టాస్ సంస్థ రూ.30 కోట్లు, ఇండో అరబ్ లీగ్ రూ.7.33 కోట్లు, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రూ.5.50 కోట్లు, సోమాజీగూడలోని కత్రియా హోటల్ రూ.8.62 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయి పన్నులు చెల్లించాలని తెలిపారు. వీరంతా తాము జారీ చేసిన రెడ్ నోటీసులకు స్పందించాలని, లేకుంటే ఆస్తులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఈ బకాయిల లిస్ట్ సిటీ జనాలు నివ్వెరపోతున్నారు. తాము వెయ్యి, రెండు వేల ఇంటి పన్ను కట్టకుంటే అధికారులు నానా యాగీ చేస్తారని, మరి కోట్ల రూపాయల బకాయిలు ఉన్న వారికి నెమ్మదిగా నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు.