ఏపీకి టెస్లా.. ప్రపంచ కుభేరుడికి ఆఫర్లే.. ఆఫర్లు..

ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ఈవీ కార్ల కంపెనీ టెస్లా కోసం దేశంలో పలు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి.

Update: 2025-02-22 11:10 GMT

ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ఈవీ కార్ల కంపెనీ టెస్లా కోసం దేశంలో పలు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబైల్లో కొన్ని స్థలాలు చూసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ స్థలాలు అవుట్ లెట్ల కోసమేనంటూ టెస్లా ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు భారత మార్కెట్లోకి ప్రవేశానికి సిద్ధమవుతున్న సంస్థ ఇప్పటికే నియామకాల ప్రక్రియ మొదలు పెట్టింది. దీంతో టెస్లా కంపెనీ ప్లాంట్ ను దక్కించుకునేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర చురుగ్గా పావులు కదుపుతుండగా, టెస్లాను ఏపీకి రప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ ద్వారా ఓ సారి టెస్లా ప్రతినిధులతో చర్చించిన ఏపీ ప్రభుత్వం.. ఈవీ కార్ల కంపెనీ స్థాపనకు ఏపీ అనుకూలంగా ఉంటుందని తాజాగా మరో లేఖ రాసింది. అంతేకాకుండా ఆ సంస్థను ఏపీకి రప్పించేందుకు భారీ ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అమెరికాకు చెందిన దిగ్గజ ఎటక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా. ప్రస్తుతం అమెరికా నుంచే ఈ కార్లు దిగుమతు అవుతున్నాయి. అయితే దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం వల్ల టెస్లా కార్ల ధర ఎక్కువగా ఉంటోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం భారత్ లో అధిక దిగుమతి సుంకాలు వల్ల తమ ఉత్పత్తులు అమ్ముకోలేకపోతున్నామని ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక కార్ల మార్కెట్ కు దేశంలో ఎక్కువ అవకాశాలు ఉండటంతో స్థానికంగా పరిశ్రమ స్థాపించి ఉత్పత్తి చేస్తే భారత మార్కెట్లో పుంజుకోవచ్చని టెస్లా భావిస్తోంది. దీంతో దేశంలో ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలిస్తోంది. అయితే టెస్లా పరిశ్రమ వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నందున దేశంలో పలు రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.

టెస్లాను తమ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తే అన్ని వనరులు సమకూరుస్తామని మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నట్లు పారిశ్రామిక వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ రెండు రాష్ట్రాలను వెనక్కి నెట్టేస్తూ ఏపీ ఈ రేసులోకి దూసుకొచ్చిందని చెబుతున్నారు. టెస్లా యాజమాన్యాన్ని టెంప్ట్ చేసేలా ఏపీ ప్రభుత్వం పలు ఆఫర్లు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా నుంచి దిగుమతుల కోసం టెస్లాకు ఏకంగా ఓ పోర్టు అప్పగిస్తామని ప్రతిపాదించినట్లు ప్రచారం జరుగుతోంది. టెస్లా ప్లాంట్ ను రాష్ట్రానికి తెచ్చేందుకు గత ఏడాది నుంచే ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. గత అక్టోబరులో అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేశ్ టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాతో సమావేశమయ్యారని గుర్తు చేస్తున్నారు.

టెస్లాను ఏపీకి రప్పించేందుకు రాష్ట్ర ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఈడీబీ) అవసరమైన స్థలాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది. రాష్ట్రానికి పోర్ట్ కనెక్టివిటీ ఉండటంతో సముద్ర మార్గం ద్వారా టెస్లా దిగుమతులు, ఎగుమతులకు సౌకర్యంగా ఉంటుందని ప్రభుత్వం సూచిస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాలకు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో గిరాకీ ఉంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ఈవీ కార్లలో 60 శాతం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనే ఉన్నాయని అంటున్నారు. దీంతో దక్షిణాదిలో టెస్లా ప్లాంట్ ప్రారంభిస్తే దేశంలో వేగంగా ఉనికిని చాటుకునే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం సలహా ఇస్తోంది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అన్నివనరులు సమకూర్చుతామని, పూర్తి సహకారం అందిస్తామని ప్రతిపాదిస్తోంది. ఏపీ ఆఫర్లతో ఇతర రాష్ట్రాలు వెనకడుగు వేస్తున్నాయని చెబుతున్నారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి పెట్టుబడుల వేటకు అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంవోయూలు జరిగాయి. కొద్దిరోజుల్లో ఈ పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండోలో పరిష్కరిస్తోంది. ఈ నేపథ్యంలో టెస్లాను కూడా ఏపీలో పెట్టేలా ఒత్తిడి చేస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడిని ముఖ్యమంత్రి చంద్రబాబు వాడుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాటకు ప్రధాని మోదీ కూడా అధిక ప్రాధాన్యమిస్తుండటంతో టెస్లా ఏపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News