400 ప్లస్ తో రాజ్యాంగంలో ఏ మారుస్తారో క్లారిటీ!
ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తపిస్తున్నారు మోడీషాలు.
ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తపిస్తున్నారు మోడీషాలు. పదేళ్ల తమ పాలనకు బహుమతిగా 400 ప్లస్ సీట్ల మెజార్టీని ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు.. ఈసారి మోడీ సర్కారు ఏర్పడితే రాజ్యాంగాన్ని మార్చేస్తారని.. రిజర్వేషన్లు ఎత్తేస్తారంటూ విపక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. మోడీ గెలుపుతో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్న వాదనను పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. విపక్షాలకు తోడుగా వామపక్ష వాదులు.. మేధావుల్లోని ఒక సెక్షన్ మోడీ సర్కారుకు ఎట్టి పరిస్థితుల్లో 300 సీట్లు దాటకూడదని కోరుకుంటున్నారు. మోడీ విజయాన్ని అడ్డుకోవటం సాధ్యం కాదన్న మాటను అంతర్గత సంభాషణల్లో చెబుతూ.. కనీసం అంతంత మెజార్టీతో ఆయన దూకుడుకు ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నారు.
ఇలాంటి వేళ.. మోడీ సర్కారు కేంద్రంలో మూడోసారి కొలువు తీరితే ఏం జరుగుతుంది? రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? అసలు బీజేపీ వాదన ఏమిటి? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? రాజ్యాంగాన్ని రద్దు చేస్తారన్న మాటలో నిజం ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కీలక అంశాల మీద ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని యథాతధంగా చూస్తే..
- రాజ్యాంగ పీఠికలో లౌకిక పదాన్ని చేర్చటం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడింది. మేం కేంద్రంలో అధికారంలోకి వస్తే పీఠిక పూర్వ రూపాన్ని పునరుద్ధరిస్తాం.
- దళితులు.. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం. రాజ్యాంగానికి పీఠిక ఆత్మ వంటిదని అంబేడ్కర్ తరచూ చెప్పేవారు. అయినప్పటికీ కాంగ్రెస్ పాలకులు లౌకిక పదాన్ని చేర్చారు.
- పీఠికలోని లౌకిక పదాన్ని చొప్పించకూడదు. ఆ చర్య అంబేడ్కర్ ఆత్మను క్షోభకు గురి చేసింది. అలీగఢ్ ముస్లిం వర్సిటీ.. జామియామిల్లియా ఇస్లామియాల్లో దళితులకు రిజర్వేషన్లు దక్కేందుకు ప్రయత్నిస్తాం.
- షెడ్యూల్ కులాలకు.. షెడ్యూల్ తెగలు..ఓబీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లకు అంతం పలికేందుకు.. రాజ్యాంగంలో మార్పులు చేసేందుకు బీజేపీ 400లకు పైగా ఎంపీ స్థానాల్ని సాధించాలని లక్ష్యంగాపెట్టుకుంటుందన్న విమర్శలపై మా వివరణ ఇదే. 1961 జూన్ 27న నాటి ప్రధాని నెహ్రూ అప్పటి ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో ఏ తరహా రిజర్వేషన్లను తాను ఇష్టపడనని.. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా సమ్మతం కాదని స్పష్టం చేయటాన్ని ఏమంటారు?
- జమ్మూకశ్మీర్ కు 370 ప్రత్యేక అధికరణాన్ని కల్పించటం ద్వారా అక్కడ దళితులు..బీసీలకు రిజర్వేషన్లు దక్కుండా కాంగ్రెస్ అడ్డుకుంది. ఎస్సీ.. ఎస్టీ.. ఓబీసీ రిజర్వేషన్లకు ప్రధాని మోడీ మహా రక్షకుడు.
సార్వత్రిక ఎన్నికల్లో తాము ఘన విజయాన్ని సాధిస్తే తమ ప్రభుత్వం ఏంచేస్తుందన్న అంశంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన ఆయన మాటలకు బలాన్ని చేకూరుస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరో వేదిక మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకిక తత్వం.. ప్రాథమిక హక్కులు వంటి వాటిని పార్లమెంట్ సహా ఏ పార్టీ నాయకుడు మార్చలేడని ఆయన స్పష్టం చేయటం గమనార్హం.
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోందన్న వాదనలో నిజం లేదన్న ఆయన.. ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ తాము అధికారంలో ఉన్నప్పుడు పలు సందర్భాల్లో రాజ్యాంగాన్ని సవరించిన వైనాన్ని గుర్తు చేవారు. అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న ప్రచారంలో నిజం లేదు. రాజ్యాంగాన్ని మార్చలేమన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ.. ప్రాథమిక హక్కులు.. ప్రజాస్వామ్యంతో సహా రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని ఏ నాయకుడు.. ఏ పార్టీ లేదా పార్లమెంట్ సవరించలేవని స్పష్టం చేశారు. మొత్తంగా రాజ్యాంగంలో మార్పుల అంశంపై ఒకే రోజు ఇద్దరు నేతలు ఇచ్చిన వివరణ.. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా ఉందన్న మాట వినిపిస్తోంది.