ఈ వర్గాలపై బీజేపీ ఫోకస్ పెట్టిందా ?

Update: 2023-08-13 05:56 GMT

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది బీజేపీ పట్టుదల. అయితే అందుకు అవకాశాలు బాగా తక్కువగానే ఉన్నాయి. అందుకని అవకాశాలు పెంచుకునేందుకు ఏమి చేస్తోందంటే ముందుగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపైన బాగా దృష్టిపెట్టింది. బీజేపీ పైన ఇప్పటివరకు అగ్రవర్ణాల పార్టీ అనే ముద్రుంది. ఆ ముద్రను చెరిపేసుకుని సమాజంలోని అన్నీ వర్గాల్లోను మద్దతు సంపాదించటమే టార్గెట్ గా పెట్టుకున్నది. అందుకనే పార్టీ అగ్రనేతల ఆదేశాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపైన దృష్టి కేంద్రీకరించింది.

తెలంగాణాలో 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇప్పటివరకు వీటిల్లో పార్టీ ప్రాతినిధ్యమే ఉండటం లేదు. 119 నియోజకవర్గాల్లో 31 నియోజకవర్గాలు రిజర్వుడంటే చిన్న విషయం కాదు. అందుకనే సెగ్మెంట్ల వారీగా పెద్ద ఎత్తున మీటింగులు పెట్టుకుని పై వర్గాల్లో పార్టీపై అభిమానం, నమ్మకం పెరిగేలా ప్రయత్నాలు చేయబోతున్నారు. అందుకనే ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 2 వేల మందితో సమావేశాలు పెట్టాలని డిసైడ్ చేశారు.

రిజర్వుడు నియోజకవర్గాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలపై అధ్యయనం చేయబోతున్నారు. దీన్ని వీలైనంత తొందరగా ముగించి పార్టీ పరంగా బలం, బలహీనతలపై ఫోకస్ చేయాలని నాయకత్వం నిర్ణయించింది. వీటన్నింటిపై నివేదిక రెడీ అవగానే నియోజకవర్గాల్లో సమావేశాలను మొదలుపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీ ఆఫీసులో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్యనేతలతో ఒకటికి రెండు సమావేశాలను నిర్వహించారు. ఇన్చార్జిలు చెప్పిన ప్రకారం సమస్యలు, పరిష్కారాలపై అధ్యయనం కూడా మొదలైంది.

కాకపోతే మరింత లోతుగా అధ్యయనం చేయాలన్నది పార్టీ నాయకత్వం ఆలోచన. ఇప్పటికే బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలతో మీటింగులు పెట్టుకున్నారు. బీసీలు బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి కార్యాచరణ మొదలుపెట్టారు. ఈటల రాజేందర్ లాంటి కొందరు నేతలు ఇదే పనిమీదున్నారు. బీసీ నియోజకవర్గాలకు తోడు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల మీద కూడా కమలంపార్టీ దృష్టి మొదలైనట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అధికారంలోకి రావటం కోసం వీలైనన్ని ప్రయత్నాలను కమలనాదులు చేస్తున్నారు. మరి ఇవన్నీ వర్కవుటవుతుందా అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News