బీజేపీ సెటిల్డ్‌ పార్టీ కాదు కానీ... ఈటల అసక్తికర వ్యాఖ్యలు!

ఈ సమయంలో జరుగుతున్న రసవత్తర పోరుపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-11-07 06:35 GMT

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. తెలంగాణలో చిన్నా పెద్దా అనే తారతమ్యాలేమీ లేకుండా ప్రతీపార్టీ ఎవరిస్థాయిలో వారు ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ప్రధానంగా బీఆరెస్, కాంగ్రెస్ - సీపీఐ, బీజేపీ - జనసేన, బీఎస్పీ, ఎంఐఎం, ప్రజాశాంతిపార్టీ మొదలైన పార్టీలు ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి. ఈ క్రమంలో 40ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ, ఫస్ట్ ఎలక్షన్ ఫేస్ చేస్తున్న వైఎస్సారీటీపీ లు పోటీనుంచి తప్పుకున్నాయి. ఈ సమయంలో జరుగుతున్న రసవత్తర పోరుపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జనసేనతో పొత్తు ఆవశ్యకతను తెలిపారు!

అవును... ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన.. తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్తుంది. ఈ సమయంలో ఈ విషయంపైనా, తెలంగాణలో బీజేపీ పరిస్థితిపైనా ఈటల స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్‌ గా లేదని, అందువల్ల జనసేనతో అవసరం ఉందని, అందుకే పొత్తు పెట్టుకున్నట్లు ఈటల స్పష్టం చేశారు. ఈ పొత్తులో భాగంగా 8 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని అన్నారు.

ఇక బీఆరెస్స్, కాంగ్రెస్ పార్టీల మాదిరిగా తెలంగాణలో బీజేపీ "సెటిల్డ్‌" పార్టీ కాదని చెప్పుకొచ్చిన ఈటల... అందువల్లే పార్టీలోకి నాయకులు వస్తుంటారు... పోతుంటారని అన్నారు. ఈ సందర్భంగా... ఏయే ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ బలంగా ఉంది.. మరేయే జిల్లాల్లో బలహీనంగా ఉంది.. ఇంకా ఏయే జిల్లాల్లో ఓ మోస్తరు బలంగా ఉంది అనే విషయాలను ఈటల వివరించే ప్రయత్నించేశారు.

ఇందులో భాగంగా... ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జీహెచ్‌ఎంసీలలో బీజేపీ సంపూర్ణంగా బలంగా ఉందని చెబుతున్న ఈటల... నల్లగొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో కొంత మేరకే ప్రభావం చూపుతుందని.. గతంతో పోలిస్తే వరంగల్, మహబూబ్‌ నగర్, మెదక్‌ మొదలైన మిగతా జిల్లాల్లో బలం పెరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్లకన్నా ఎక్కువే సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదె సమయంలో గతకొన్ని రోజులుగా బీజేపీ - బీఆరెస్స్ ఒకటే అంటూ వస్తున్న కామెంట్లపైనా ఈటల రాజేందర్ స్పందించారు. అది అసత్యమని అన్నారు. అందుకు అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అదే నిజమైతే తాను గజ్వేల్‌ లో కేసీఆర్‌ పై ఎందుకు పోటీ చేస్తానని ఈటల ఎదురు ప్రశ్నిస్తున్నారు. అయితే... గతంలో టీఆరెస్స్ పార్టీ కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుంది తప్ప బీజేపీతో ఎప్పుడూ లేదని గుర్తుచేశారు.

ఫలితంగా... ఈసారి ఎన్నికల్లో ఒకవేళ రాష్ట్రంలో హంగ్‌ ఏర్పడితే కాంగ్రెస్, బీఆరెస్స్ ఒకటవుతాయి తప్ప కాంగ్రెస్, బీజేపీ కలుస్తాయా? అని ప్రశ్నించారు. ఇక 2014లో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలంతా మూకుమ్మడిగా చేరడం.. 2018లో ఎన్నికల్లో గెలిచిన 19 మందిలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ పంచన చేరడం గుర్తుందని అన్నారు. అందుకే... కేసీఆర్ ను బీజేపీ మాత్రమే నిలువరించగలదని ప్రజలు నమ్మాలని ఆయన కోరారు!

ఇదే సమయంలో ఇటీవల అమిత్ షా ప్రకటించిన... “తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి” పైనా ఈటల స్పందించారు. ఇందులో భాగంగా... 1947 నుంచి ఇప్పటివరకు తెలుగునాట బీసీ సీఎం లేరని.. జనాభాలో 52 శాతం ఉన్నా పరిపాలన అందని ద్రాక్షే అని.. అందుకే బీజేపీ బీసీ బిడ్డను సీఎం చేస్తా అని ప్రకటించిందని.. దేశంలో బీసీలకు అవకాశాలు కల్పించిందే బీజేపీ అని తెలిపారు.

Tags:    

Similar News