బీజేపీకి ఇదో 'పెద్ద బాధ'.. సతమతమవుతున్న కీలక నేతలు!
బీఆర్ ఎస్‌తో తమను జతకట్టి.. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం తమ పుట్టి ముంచుతుందని కీలక నాయకులు కూడా ఆందోళనతో ఉన్నారు.
కాంగ్రెస్ వేచిన పాచిక బాగానే పనిచేస్తోందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఊరూ వాడా చేస్తున్న ప్రచారం ఫలించే అవకాశం ఉందా? తమకు లబ్ధి చేకూరకపోయినా.. పొరుగు పార్టీకి మాత్రం మేలు జరగకూడదన్న రాజకీయ నీతిని అవలంబిస్తున్న కాంగ్రెస్ దూకుడుతో బీజేపీ తల్లకింద లు అవుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని గట్టి సంకల్పమే చెప్పుకొంది. ఈ క్రమంలో తన బలం ఎలా ఉన్నా.. పొరుగు పార్టీలను అంతో ఇంతో బలహీన పరచాలన్న రాజకీయ వ్యూహానికి తెరదీసింది. నిజమో కాదో.. తెలియదు కానీ.. కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో అధికార బీఆర్ ఎస్- కేంద్రంలోని అధికార బీజేపీ ఒక్కటేనని చెబుతున్నారు. గ్రామ గ్రామాన ఊరూవాడా.. ఈ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు.
అందుకేలిక్కర్ కేసులో కవితను కూడా అరెస్టు చేయలేదని కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు బాహాటం గానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిణామంపై బీఆర్ ఎస్ పెద్దగా స్పందించడం లేదు కానీ.. బీజేపీలో మాత్రం తర్జన భర్జన, భయాందోళన స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీఆర్ ఎస్‌తో తమను జతకట్టి.. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం తమ పుట్టి ముంచుతుందని కీలక నాయకులు కూడా ఆందోళనతో ఉన్నారు.
ఇదే విషయాన్ని తాజాగా మాజీ మంత్రి, బీజేపీనాయకుడు ఈటల రాజేందర్ వ్యక్తం చేశారు. "బీజేపీ-బీఆర్ ఎస్ ఒక్కటే అనే ప్రచారం మా దృష్టికి వచ్చింది. అయితే.. దీనిని విశ్వసించొద్దని ప్రజలను కోరుతున్నా. ఎందుకంటే.. బీఆర్ ఎస్-బీజేపీ ఒక్కటే అయితే.. కేసీఆర్‌పై నేనెందుకు పోటీచేస్తా? మా పార్టీ టికెట్ ఎందుకు ఇస్తుంది. ఈ ప్రచారం క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా అడ్డుకోవాలని అధిష్టానానికి సూచించా" అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిణామంతో బీజేపీ కాంగ్రెస్ వ్యూహంలో చిక్కుకుందనే చర్చ సాగుతోంది. చివరకు ప్రజలు ఏం తేలుస్తారో చూడాలి.