ఎవరు రాశారండీ.. ఈ స్క్రిప్టు! : నెటిజన్ల కామెంట్స్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీ.. ప్రచారాన్ని ముమ్మరం చేసింది
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్న బీజేపీ.. ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ క్రమంలో రాష్ట్రస్థాయి నాయకుల కన్నా.. కేంద్రంలోని పెద్దలే ఇప్పుడు తెలంగాణ బీజేపీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలోనే బీజేపీ అగ్రనేతలు రంగంలోకి దిగిపోయారు. జిల్లాలను పంచేసుకున్నారు. ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ, పీయూష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారంలో పాల్గొంటున్నారు.
అయితే.. అమిత్‌షా, మోడీలను పక్కన పెడితే.. మిగిలిన నాయకులు ప్రసంగిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. గుడ్డిగా తమ వద్ద ఉన్న స్క్రిప్టున వారు ఏక బిగిన చదివేస్తున్నారు. సీనియర్లు అయితే.. కొంత స్థానికతను కలుపుకొని మాట్లాడుతున్నా.. అనురాగ్ ఠాకూర్ వంటి.. అసలు తెలంగాణతో సంబంధం లేని వారు.. మాత్ర స్క్రిప్టును యథాతథంగా చదివి వినిపిస్తున్నారు. అయితే.. వీరెవరూ సొంతగా మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం.. స్క్రిప్టు కూడా.. 90 పర్సంట్ సేమ్‌టు సేమ్‌గా ఉండడం గమనార్హం. ఎవరు ఎక్కడ మాట్లాడినా.. సీఎం కేసీఆర్ అవినీతి చేశారని అంటున్నారు. అవినీతిని తేలుస్తామని చెబుతున్నారు. కానీ, ఆ అవినీతి ఏంటనేది ఎవరూ వెల్లడించడం లేదు.
కామన్ స్క్రిప్టు సారాంశం ఇదీ..
+ సీఎం కేసీఆర్ అవినీతి పాలన చేశారు
+ కాంగ్రెస్-కేసీఆర్ ఒక్కటే.. ఇద్దరి డీఎన్ ఏ కూడా ఒక్కటే
+ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టండి
+ బీజేపీ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తాం
+ పేదలకు అన్యాయం చేశారు.
+ తెలంగాణ సమాజాన్ని మోసం చేశారు
+ కుటుంబానికి పదవులు ఇచ్చారు
+ కేసీఆర్‌ను గెలిపిస్తే.. కాంగ్రెస్‌ను గెలిపించినట్టే
ఇదీ.. ఇతమిత్థంగా యోగి, అనురాగ్, నడ్డా, పీయూష్, గడ్కరీల ప్రసంగాల్లో వినిపిస్తున్న కామన్ స్కిప్టు డైలాగులు. ఈ డైలాగులపైనే నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఎవరు రాశారండీ స్క్రిప్టు! అని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితులపైనా.. ఇక్కడ సమాజంపైనా ఎలాంటి అవగాహన లేకుండా.. సమస్యలు ప్రస్తావించకుండా.. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ.. రాసిన స్క్రిప్టును చదువుతున్నారు. రేపు పోలింగ్ ప్రక్రియ మొదలవగానే వీరంతా ఎక్కడుంటారో కూడా తెలియదు! అని వ్యాఖ్యానిస్తున్నారు.