ఢిల్లీలో 15 మ్యూజియంలకు బాంబు బెదిరింపులు

రాజధాని ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపారు.

Update: 2024-06-12 14:51 GMT

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దేశంలో పలు విమానాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, రాజకీయ నేతలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీలోని సుమారు 15 మ్యూజియంలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక 13 ఏళ్ల కుర్రాడు టోరంటో విమానంలో బాంబు పెట్టినట్లు ఢిల్లీ విమానాశ్రయానికి కాల్ చేశాడు. మే నెలలో ఢిల్లీలోని నాలుగు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

రాజధాని ప్రాంతంలోని రైల్వే మ్యూజియం సహా మొత్తం 10 నుంచి 15 మ్యూజియంలకు కొందరు వ్యక్తులు బాంబు బెదిరింపు మెయిల్స్‌ పంపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఆయా మ్యూజియంల వద్ద తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో ఇది బూటకపు మెయిల్‌ అని తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం జమ్ములోని శివ్ ఖోరి నుండి కాట్రాకు వెళ్తున్న యాత్రికుల బస్సు మీద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడి మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది గాయపడ్డారు. ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు రంగంలోకి దిగిన భద్రతదళాల కాల్పులలో ఒక తీవ్రవాది మరణించగా, ఒక పౌరుడు గాయపడ్డాడు. చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతూ స్థానికులను ఉగ్రవాదులు తాగునీళ్లు అడుగుతుండగా వారు భయంతో తలుపులు మూసుకుని ఆర్మీకి సమాచారం అందిస్తున్నారు.

Tags:    

Similar News