బోరుగడ్డ అనిల్ కు నో బెయిల్.. తేల్చేసిన ఏపీ హైకోర్టు
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైనట్లుగా పోలీసులు కోర్టుకు చెప్పారు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్.. నారా లోకేశ్ తదితర అగ్రనేతలపై మాటల్లో చెప్పలేనంత దారుణ రీతిలో పోస్టులు పెడుతూ.. చెలరేగిపోయే రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నో చెప్పింది. బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టటమే పనిగా పెట్టుకున్నారా? అంటూ వ్యాఖ్యానించిన ఏపీ హైకోర్టు.. ‘ఇలాంటి వారిని క్షమించటానికి వీల్లేదు’’ అని తేల్చి చెప్పటం గమనార్హం.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలైనట్లుగా పోలీసులు కోర్టుకు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో విపక్ష నేతలపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టటం.. దారుణ పదజాలంతో వ్యాఖ్యలు చేయటంలో బోరుగడ్డ అనిల్ కు ఉన్న పేరుప్రఖ్యాతులు అంతా ఇంతా కావు. అప్పటి ప్రభుత్వ నేతల అండతో చెలరేగిపోయిన అతడిపై ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా పోలీసులు స్పందించేవారు కాదు.
ఒకదశలో బోరుగడ్డ వైపు పోలీసులు కన్నెత్తి చూసేందుకు సైతం సాహసించేవారు కాదన్నట్లుగా ప్రచారం జరిగేది. అనిల్ అరాచకానికి హద్దే లేకుండా పోయేది. తనను తాను కేంద్రమంత్రిగా పని చేసిన రాందాస్ అఠావలె అనుచరుడిగా చెప్పుకునేవాడు. గుంటూరుకు చెందిన ఇతను తనను తాను పులివెందులకు చెందిన వ్యక్తిగా ప్రచారం చేసుకునేవారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత అనిల్ తీరు మారలేదు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో అతనిపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసులు నమోదు చేశారు.
ప్రస్తుతం అరెస్టు అయి.. జైల్లో ఉన్న అతను బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఓవైపు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టటం.. మరోవైపు వైసీపీ అనుకూల మీడియాలోనూ.. టీవీ చానళ్లలోనూ నోటికి వచ్చినట్లుగా మాటట్లాడేవారు. అసభ్యకర పదజాలంతో దూషించేవాడు. తన వాదనకు వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తానని బెదిరింపులకు దిగేవాడు. ప్రతిపక్షాలకు చెందిన మహిళలను ఉద్దేశించి.. సభ్య సమాజంలో మాట్లాడలేని మాటలతో చిత్రహింసలకు గురి చేసేవాడు. తాజాగా జరిగిన బెయిల్ పిటిషన్ విచారణలో హైకోర్టు సైతం ఇతని తీరుపై చేసిన వ్యాఖ్యలు.. అతడెంత ముదురు కేసు అన్న విషయం అర్థమవుతుంది.