జైల్లో బోరుగడ్డ కాన్ఫరెన్సు కాల్స్ రాజసం!
తప్పుడు ధ్రువపత్రాలు చూపించి కోర్టును బోల్తా కొట్టించి మధ్యంతర బెయిల్ ను పొడిగించుకున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వ్యవహారానికి సంబంధించి సరికొత్త షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి.;
తప్పుడు ధ్రువపత్రాలు చూపించి కోర్టును బోల్తా కొట్టించి మధ్యంతర బెయిల్ ను పొడిగించుకున్న రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ వ్యవహారానికి సంబంధించి సరికొత్త షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. వైసీపీకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న చంద్రబాబు.. లోకేశ్.. పవన్ కల్యాణ్ లను మాత్రమే కాకుండా వారి ఇంట్లో ఉండే మహిళలతో పాటు.. టీడీపీ.. జనసేన నేతలపై ఒక రేంజ్ లో విరుచుకుపడటంతో.. నిత్యం వివాదాస్పద పోస్టులతో సోషల్ మీడియాలో చెలరేగిపోయిన బోరుగడ్డ అనిల్ అరెస్టు కావటం.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లటం వరకు అందరికి తెలిసిన విషయాలే.
జైల్లో ఉన్న వేళలో అతగాడి హవా గురించిన దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. జైల్లో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ కదలికలు.. అతడి వ్యవహారాన్ని పట్టించుకోని ప్రభుత్వం అందుకు తగిన మూల్యం చెల్లిస్తోంది. జైలు సిబ్బంది అతనికి దాసోహం కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో కూటమి ప్రభుత్వం సరైన రీతిలో నిఘా ఏర్పాటు చేయకపోవటం.. అసలేం జరుగుతుందన్న అంశాలపై ఒక కన్నేసే ధోరణి లేకపోవటం కూడా ఇలాంటి పరిస్థితికి కారణాలుగా చెబుతున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న వెసులుబాటును తనదైన శైలిలో వినియోగించుకున్న బోరుగడ్డ.. జైలు నుంచి విడుదల కావటానికి తగిన ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు.
రిమాండ్ ఖైదీకి వారానికి మూడుసార్లు ఫోన్ లో మాట్లాడేందుకు వీలు కల్పిస్తారు. ఈ సందర్భంగా వారి సంభాషణలు రికార్డు అవుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు వింటూ ఏదైనా సందేహం వస్తే అప్రమత్తం కావాలి. అయితే.. బోరుగడ్డ విషయంలో జైలు అధికారులు ఇవేమీ పట్టించుకోలేదన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది. జైలు నుంచి ఒక నంబరుకు బోరుగడ్డ ఫోన్ చేస్తే.. సదరు వ్యక్తి వైసీపీ ముఖ్యనేతల్ని.. మరికొందరికి తన నంబరు నుంచి కాన్ఫరెన్సు కలిపి మాట్లాడుకునే వారన్న విషయాన్నితాజాగా గుర్తించారు.
కాన్ఫరెన్స్ కాల్స్ సంభాషణలు యథేచ్ఛగా కొనసాగినా జైలు సిబ్బంది పట్టించుకోలేదన్న విషయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఇదే తప్పుడు ధ్రువ పత్రాలతో మధ్యంతర బెయిల్ పై విడుదలయ్యే అవకాశాన్ని కల్పించినట్లుగా చెబుతున్నారు. అతను చేసిన పోన్ కాల్స్ కు సంబంధించిన సీడీఆర్ ను తీసి కాల్ డేటా రికార్డును విశ్లేషిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయంటున్నారు. మరి.. ఈ వ్యవహారంపై కూటమి సర్కారు.. జైలు సిబ్బంది ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.