విశాఖకు బొత్స.. కుమారుడికి సొంత నియోజకవర్గం!
తండ్రి విశాఖ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో తమ కోటను నిలుపుకునే పనిని బొత్స సందీప్ తన భుజాలకెత్తుకున్నారు.
మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నయా పొలిటికల్ ప్లాన్ హాట్ టాపిక్ అవుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన బొత్స తొలి నుంచి సొంత జిల్లా విజయనగరం కేంద్రంగానే రాజకీయాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల నుంచి ఆయన ఫోకస్ పక్కనే ఉన్న విశాఖ సిటీపై పడింది. వైసీపీ అధికారంలో ఉండగా పరిపాలన రాజధాని చేస్తామని ప్రకటించడంతో విశాఖకు ప్రాధాన్యం పెరిగింది. ఈ ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించినా, కూటమి ప్రభుత్వంలో విశాఖ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకుంటోంది. ఐటీ పరిశ్రమలతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు విశాఖ కేంద్రం. ఇలాంటి చోట ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్న నాయకుడు లేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది. దీంతో ఆ లోటు పూడ్చేందుకు ఎన్నికల ముందు నుంచి బొత్స పావులు కదుపుతూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మీని విశాఖ పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీకి పెట్టారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత బొత్స పూర్తిగా విశాఖ రాజకీయాలపై కన్నేశారు. మూడు నెలల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి విజయనగరం జిల్లా రాజకీయాలను వెనక్కి పెట్టి పూర్తిగా విశాఖ రాజకీయాలపై ఫోకస్ చేశారు బొత్స.
ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖ నగరంలో బొత్స మకాం వేయడం, ఆ జిల్లా వ్యవహారాలను పర్యవేక్షిస్తుండటంతో విజయనగరం జిల్లా రాజకీయాలు బొత్స మేనల్లుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను చూస్తున్నారు. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు కూడా చిన్న శ్రీను కనుసన్నల్లోనే జిల్లా రాజకీయాలు కొనసాగినా, పెద్ద దిక్కుగా బొత్సకు ఒక మాట చెప్పేపరిస్థితి ఉండేది. మరోవైపు బొత్స సొంత నియోజకవర్గం చీపురుపల్లి బాధ్యతలను కూడా చిన్న శ్రీనే చూసేవారు. అయితే ఎన్నికల ఓటమి తర్వాత చీపురుపల్లి బాధ్యతలను బొత్స తనయుడు సందీప్ తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో అసెంబ్లీ లేదా విజయనగరం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన బొత్స సందీప్ అధిష్టానం అనుమతి లేక కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. ప్రస్తుతం తన తండ్రి వైజాగ్ రాజకీయాలపై ఫోకస్ చేయడంతో సందీప్ తరచూ చీపురుపల్లి వస్తూ తన రాజకీయ భవిష్యత్ కోసం గట్టి పునాదులు వేసుకుంటున్నారని చెబుతున్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో బొత్సకు బలమైన అనుచరవర్గం ఉంది. గత ఎన్నికల్లో ఆయన ఓటమిని ఎవరూ ఊహించలేదు. కూటమి గాలిలో బొత్స పునాదులు కూడా కదిలిపోవడం రాష్ట్ర రాజకీయాల్లో ఓ సంచలనమైంది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటైన చీపురుపల్లిలో బొత్స అడుగు పెట్టిన తర్వాత ఆయన అడ్డాగా మారిందని చెబుతుంటారు. 2004లో తొలిసారి చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స 2009, 2019 ఎన్నికల్లో గెలిచి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతే, సుమారు 42 వేల ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచిన బొత్స చీపురుపల్లిలో తన సత్తా చాటారు. ఆ ఎన్నికల్లో బొత్స ఓడినా, ఆయనకు వచ్చిన ఓట్లు, అప్పట్లో కాంగ్రెస్ పరిస్థితి వల్ల ఆయనకు నైతిక మద్దతు లభించందని భావించారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం కూటమి సునామీకి బొత్స కోట కూడా బద్ధలైంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి చీపురుపల్లిని కుమారుడికి అప్పగించాలని, కుదిరితే తాను వైజాగ్ కే పరిమితమవ్వాలని బొత్స భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తండ్రి విశాఖ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో తమ కోటను నిలుపుకునే పనిని బొత్స సందీప్ తన భుజాలకెత్తుకున్నారు. ఎన్నికల్లో తన తండ్రి ఓడినా, వచ్చే ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్లు సమయం ఉన్నా సందీప్ మాత్రం నియోజకవర్గాన్ని వదిలిపెట్టడం లేదు. విశాఖలో సొంత ఆసుపత్రి నిర్వహిస్తున్న సందీప్, కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా ముందుకు వస్తుండటంతో కేడర్ సందీప్ నాయకత్వాన్ని కోరుకుంటోందని చెబుతున్నారు. తండ్రిని మరిపించేలా అందరికీ అందుబాటులో ఉండటంతో ఇటీవల ఆయన పుట్టిన రోజు కార్యక్రమాన్ని కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మరోవైపు ధీర ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్న సందీప్ జిల్లాలో సొంతంగా ఎదగాలని ఉబలాటపడుతున్నట్లు కనిపిస్తోంది. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల నాటికి బొత్స బదులు ఆయన వారసుడు చీపురుపల్లి వేదికపై మెరిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.