బొత్స జనసేనకు ఎంత దూరం ?
విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జనసేనకు ఎంత దూరం అన్న చర్చ వస్తోంది.
విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జనసేనకు ఎంత దూరం అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే బొత్స తమ్ముడు లక్ష్మణ రావు జనసేనలో చేరుతారు అని టాక్ బలంగా సాగుతోంది. ఆయన రేపో మాపో కండువాను వేసుకుంటారు అని అంటున్నారు.
మరి మొత్తం కుటుంబానికి పెద్ద అయిన బొత్స తమ్ముడు ఇలా చేస్తూంటే తనను వైసీపీ కాదని సొంత రాజకీయం చేసుకుంటే ఊరుకుంటారా అన్న చర్చ ఉంది. అయితే అన్నీ తెలిసిన వారు బొత్స మార్క్ పాలిటిక్స్ మీద అవగాహన ఉన్న వారు ఆయన కుటుంబం ఆయనతోనే ఉంటుందని చెబుతారు.
బొత్స ఎంత చెబితే అంతే అన్నట్లుగా ఉంటారు అని కూడా అంటారు. అలాంటి కుటుంబంలో చీలిక వచ్చిందా లేక సొంత నిర్ణయాలు తీసుకునే రాజకీయ తాహతు తమ్ముళ్లకు వచ్చిందా అన్న చర్చ కూడా ఉంది. అయితే బొత్సకు తెలియకుండా ఇదంతా జరగదు అని అంటున్నారు. బొత్స రాజకీయం అంతా వేరేగా ఉంటుంది అని అంటున్నారు.
ఆయన ఇపుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు. శాసనమండలిలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆయన ఇటీవలనే ఎమ్మెల్సీ అయ్యారు. జగన్ ఆయనకు అవకాశం ఇచ్చారు. అలా ఆయన గెలిచారు. ఇక ఆయన పదవీ కాలం నాలుగేళ్ళ పాటు ఉంది. ఆయన 2028 దాకా ఈ పదవిలో ఉంటారు
ఆ మీదట కొద్ది నెలలకు ఎటూ ఎన్నికలు వస్తాయి. అప్పటికి ఏ రాజకీయ గాలి ఎలా ఉంటుందో చూసుకుని దానికి అనుగుణంగానే ఆయన స్టెప్ వేస్తారు అని అంటున్నారు. అయితే అందాకా ఆయన కొత్త వ్యూహాలలో కూడా ఉన్నరని అంటున్నారు.
ఆయన తమ్ముడు జనసేనలో ఉంటే 2029 నాటికి కూడా కూటమి బలంగా ఉండి జనసేన గట్టిగా ఉంటే ఆ పార్టీలో చేరిపోవడానికి కూడా బొత్సకు గ్రీన్ సిగ్నల్ ఉంటుందని అంటున్నారు. అందుకే ఆయన ముందస్తుగా కర్చీఫ్ పరచేందుకే తమ్ముడిని పంపిస్తున్నారు అని అంటున్నారు.
బొత్స వంటి వారికి తెలియకుండా తమ్ముడు జనసేన వైపు అడుగులు వేయరని ఇదేదో నయా పాలిటిక్స్ అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా చూస్తే కనుక విజయనగరం జిల్లాను చూసుకోమని జగన్ ఆయనకు అప్పగించారు. అలాంటి వేళ సొంత తమ్ముడే గోడ దూకితే బొత్స కాచుకోలేరా అని కూడా చర్చ సాగుతోంది.
ఇక చూస్తే బొత్స కాంగ్రెస్ లో ఉంటూ ఎదిగారు. ఆ తరువాత ఆయన టీడీపీలోకి కూడా వెళ్లాలని అనుకున్నా కేంద్ర మాజీ మంత్రి అశోక్ అక్కడ ఉండడం వల్ల ఆల్టరేషన్ కోసం వైసీపీ వైపు వచ్చారు అని కూడా చెప్పుకున్నారు.
వైసీపీలో చేరినందుకు బొత్సకు రాజకీయంగా నష్టం ఏమీ జరగలేదు. ఆయన అయిదేళ్ల పాటు జగన్ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. తన వారు అందరికీ టికెట్లు ఇప్పించుకున్నారు. తాను కూడా మరింతగా రాజకీయంగా కుదురుకున్నారు. ఇక ఇపుడు పార్టీ ఓడినా నాలుగేళ్ళ కాలానికి సరిపడా పదవిని అందుకున్నారు. అయితే ఫ్యూచర్ పాలిటిక్స్ ని దృష్టిలో పెట్టుకునే బొత్స ఎపుడూ అడుగులు వేస్తారు అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే బొత్స తమ్ముడు వైసీపీ వీడడం జనసేన వైపుగా సాగడంతో అందరి చూపు బొత్స మీదనే ఉంది అని అంటున్నారు.