సంక్రాంతి ముహుర్తం ఏంది బొత్స?

ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.

Update: 2024-10-22 04:30 GMT

ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలోని కూటమి సర్కారుపై విమర్శలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా తాను రాజకీయాల గురించి మాట్లాడాలని అనుకోవటం లేదన్నారు. ఇందుకు సంక్రాంతిని తుది గడువుగా పెట్టుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో అతిసారాన్ని అరికట్టటంతో ప్రభుత్వం ఫెయిల్ అయయిందని మండిపడ్డారు. కూటమి సర్కారు బాధ్యతారాహిత్యంతోనే చాలామంది చనిపోయినట్లుగా చెప్పారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన తాను సంక్రాంతి వరకు రాజకీయాల గురించి మాట్లాడకూడదని అనుకున్నట్లుగా చెప్పారు. ‘ఎలాంటి విమర్శలు సంక్రాంతి వరకు చేయకూడదని అనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు. ఇదే నిజమైతే..అది తప్పు అవుతుంది కదా? ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నప్పుడు.. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు గొంతెత్తి మాట్లాడాలి. సమస్యను తెర మీదకుతీసుకురావాలి. ప్రభుత్వవిధానాల్ని ప్రశ్నించాలి. ఇవన్నీ కూడా రాజకీయంగా భావించకూడదు.

నాయకుడు అనేవాడు ఎవరైనా ప్రజల తరఫున.. ప్రజల కోసం.. ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నా లేకున్నా.. నాయకుడికి ఉండే ప్రధమ లక్షణాన్నివదిలేయటం ఏమిటి? అన్నది ప్రశ్న. అతిసారం కారణంగా అమాయక ప్రజలు మరణిస్తున్నప్పుడు.. ఆ సమస్య తీవ్రతను.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపాల్సిందే. అలా చేస్తే.. రాజకీయం అవుతుందనుకుంటే తప్పే అవుతుంది.

ఇక.. జమిలి ఎన్నికలు2026 చివర్లో కానీ 2027 మొదట్లో కానీ వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారని.. ఈ నేపథ్యంలో తాము రాజకీయంగా నిలదొక్కుకునేందుకు మాట్లాడాల్సి వస్తుందని చెప్పిన మాటల్ని చూస్తే.. అన్నీ మాటలు బొత్సవేనా? అన్న భావన కలుగక మానదు. నిజానికి మీడియాతో మాట్లాడే ముందు.. ఎంత సీనియర్ నేత అయినా.. తాను ఏం మాట్లాడాలని అనుకుంటున్న వైనంపై కాస్త కసరత్తు చేస్తే బాగుంటుందన్న భావన కలుగక మానదు. ఈ విషయం బొత్సకు కూడా వర్తిస్తుందన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News