RRRపై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ప్రశంసలు
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా న్యూ ఢిల్లీలోని G20 వేదికకు విచ్చేసిన సంగతి తెలిసిందే.
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా న్యూ ఢిల్లీలోని G20 వేదికకు విచ్చేసిన సంగతి తెలిసిందే. శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోడీతో సోలో మీట్ కోసం ప్రపంచ దేశాల నాయకులు రెడ్ కార్పెట్‌పై నడిచినప్పుడు, లూలా బ్రెజిలియన్ ప్రథమ మహిళతో కలిసి ఈ వేదికకు విచ్చేశారు. జి20 శిఖరాగ్ర సదస్సుకు విచ్చేసిన సందర్భంగా ఆయన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ RRR పై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది.
తాను RRR సినిమా చూశానని, ఇందులో డ్యాన్సులు, నటన, ఫన్, జాయ్, కామెడీ సీన్స్ ప్రతిదీ తనకు బాగా నచ్చాయని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా అన్నారు. ఎవరైనా కొత్తవారితో మాట్లాడినప్పుడు మీరు RRR సినిమా చూశారా? అని అడుగుతానని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇంత అద్భుత సినిమా తీసిన రాజమౌళికి దేశాధ్యక్షుడు అభినందనలు తెలిపారు.
ఇటీవలే జాతీయ అవార్డుల్లో ఏకంగా 10 అవార్డులు కొల్లగొట్టింది ఆర్.ఆర్.ఆర్. అంతకుముందు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డులు, గోల్డెన్ గ్లోబ్ పురస్కారం, ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్ ని గెలిచిన ఏకైక భారతీయ చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ రికార్డులకెక్కింది. ఈ సినిమా రిలీజైన ఏడాది తర్వాత కూడా ఇంకా చర్చల్లో నిలుస్తోంది. సినీరాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకోవడమే గాక దేశ విదేశాల నుంచి ప్రముఖుల అభిమానం చూరగొన్న చిత్రంగా రికార్డుల్లో నిలిచింది. అమెరికా, బ్రిటన్ కి చెందిన పలువురు సెలబ్రిటీల నుంచి ఆర్.ఆర్.ఆర్ ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
దిల్లీలో జరుగుతున్న జి20 శిఖరాగ్ర సదస్సుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా ఎంతో స్టైలిష్ గా విచ్చేశారు. ఫార్మల్ బ్లూ సూట్ ధరించి, 77 ఏళ్ల నాయకుడు తన 57 ఏళ్ల భార్య రోసాంజెలా డా సిల్వాతో చేయి చేయి కలిపి నడుస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరూ కలిసి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం వద్దకు చేరుకుని ప్రధాని మోదీ వైపు నడిచారు. లూలా ప్రధానమంత్రితో కరచాలనం చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ప్రధాని మోదీ అధ్యక్షుడితో కరచాలనం అనంతరం బ్రెజిల్ ప్రథమ మహిళకు అభివాదం చేసారు.