కేసీఆర్ అండ్ జగన్... ఒకే పడవలో ప్రయాణం !
ఇద్దరూ అన్నదమ్ములుగా మెలిగారు. ఇద్దరూ ఒకరి మేలు మరొకరు కోరుకున్నారు.
ఇద్దరూ అన్నదమ్ములుగా మెలిగారు. ఇద్దరూ ఒకరి మేలు మరొకరు కోరుకున్నారు. ఏపీలో జగన్ గెలవాలని 2014 నుంచే కేసీఆర్ కోరుకున్నారు అది 2019లో సాకారం అయింది. ఇక 2024లోనూ వైసీపీయే అధికారంలోకి వస్తుందని అక్కడ కేసీఆర్ కేటీఆర్ జోస్యాలు చెప్పారు. కానీ జరిగింది వేరు.
మొత్తానికి 2019లో ఏపీలో జగన్ తెలంగాణాలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక భాయీ భాయీ అన్నట్లుగా మెలిగారు. అలా కొనసాగిన ఈ బంధం ఓటమిలోనూ ఒకటిగానే చేసింది. ఇద్దరూ కొన్ని నెలల తేడాతో ఓటమి పాలు అయ్యారు. సిట్టింగులకు సీట్లు అన్నీ ఇచ్చి కేసీఆర్ ఓడితే. సెట్టింగులను భారీ ఎత్తున తప్పించి జగన్ ఓటమి పాలు అయ్యారు. ఎవరు ఏమి చేసినా ఫలితం మాత్రం ఒక్కటిగానే వచ్చింది.
ఇవన్నీ ఇలా ఉంటే ఓటమి తరువాత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ ఎస్ పార్టీ అనేక ఇబ్బందులు పడుతోంది. ఆ పార్టీలో ఉన్న వారు, కేసీఆర్ అంటే ఎంతో విధేయత చూపించేవారు అంతా అధికార కాంగ్రెస్ వైపు పరుగులు తీసారు. దానికి తోడు లోక్ సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా దక్కించుకోలేక బీఆర్ఎస్ చతికిలపడింది.
ఇక బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది ఒక చర్చగా ఉంది. ఏపీలో చూస్తే వైసీపీ కూడా అదే తీరులో ఉంది. పార్టీ ఓటమి పాలు అయ్యాక నేతలు అంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. వారు పార్టీని వీడేటప్పుడు చెప్పే మాటలు కేవలం సాకులు అని అర్థం అవుతోంది. అధికారంలోకి తిరిగి వైసీపీ రాకపోవడమే అసలైన కారణం అని కూడా అంటున్నారు.
కేసీఆర్ నేతలను పిలిచి పార్టీ మారవద్దు మనకు ఉన్నది మంచి కాలం అని ఎంత నచ్చచెప్పినా చేయాల్సిన పనిని వారు చేస్తున్నారు. ఏపీలో అయితే ఎంత బుజ్జగించినా వెళ్ళిపోయే వారు ఎటూ పోతారు అన్న వైఖరితో వైసీపీ అధినాయకత్వం ఉంది. మొత్తానికి చూస్తే అటూ ఇటూ ఒకే సీన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి క్యూలు కడుతూంటే ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీ వైపు క్యూలు కడుతున్నారు.
ఇలా చూసుకుంటే విజయాలల్లోనే కాదు ఇబ్బందులలోనూ బీఆర్ఎస్ కి వైసీపీకి మధ్య ఇంత సారూప్యమా అని అంతా చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఈ రెండు పార్టీల పుట్టుక నడక ఒకానొక టైం లో ఆ పార్టీలు చూపిన తీవ్ర రాజకీయ ప్రభావం గురించి కూడా చర్చించుకోవాలి.
బీఆర్ఎస్ ఒక ఎమోషన్ నుంచి పుట్టింది. ప్రత్యేక తెలంగాణా అన్న భావోద్వేగ నినాదంతో ఆనాడు టీఆర్ఎస్ ఏర్పాటు అయింది. ఉద్యమ పార్టీగా ఉంటూ రాజకీయాలు చేస్తూ చివరికి లక్ష్యం చేరుకుంది. జనాలు తెలంగాణా రాష్ట్రం తెచ్చినందుకు రెండు సార్లు కేసీఆర్ ని సీఎం గా చేసి రుణం తీసుకున్నారు. ఆ లెక్క సరిపోయింది అని కూడా ప్రజలు భావిస్తూ ఉండవచ్చు అని కూడా విశ్లేషిస్తున్నారు.
ఏపీలో చూస్తే వైఎస్సార్ అనే ఒక భావోద్వేగం చుట్టూ అల్లుకుని వైసీపీ పుట్టింది. వైఎస్సార్ కి అయిదేళ్ళ పాటు సరిపడ అధికారం ఇస్తే ఆయన కేవలం మూడు నెలలలోనే ప్రమాదవశాత్తు మరణించడంతో జనాలకు ఆయన మీద ఆ ప్రేమ అభిమానం అలాగే ఉండిపోయాయి. వాటిని ఆయన కుమారుడు జగన్ మీద చూపించారు.
తండ్రి వారసుడిగా జగన్ కి చాన్స్ ఇవ్వాలని భావించి ప్రజలు 2014లోనే చాలా వరకూ టర్న్ అయినా విభజన వల్ల ఏపీలో ఏర్పడిన కొత్త రాజకీయంతో అది ఫలప్రదం కాలేదు. కానీ 2019లో జనాలు జగన్ కి పట్టం కట్టి ఆ విధంగా జగన్ రుణం వైఎస్సార్ రుణం తీర్చుకున్నారు.
ఈ లెక్కన చూస్తే ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ గా పుట్టిన బీఆర్ఎస్ జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్ బీజేపీలకు ఒక దశలో ఖంగు తినిపించింది. ప్రాంతీయ పార్టీగా ఉమ్మడి ఏపీలో ఉన్న టీడీపీకి కూడా తెలంగాణాలో మనుగడ లేకుండా చేసింది. అంతలా బీఆర్ఎస్ తన రాజకీయ ప్రతాపాన్ని చూపించింది. ఒక దశలో దాని చుట్టే రాజకీయాలను మొత్తం తిప్పుకుంది.
ఇక ఏపీలో చూస్తే అదే పరిస్థితి. వైఎస్సార్ ని కేంద్ర బిందువుగా చేసుకుని వైసీపీ ఏర్పాటు కావడంతో పాటు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు సైతం గల్లంతు చేసి ఏపీలో బలమైన ఒక ప్రాంతీయ పార్టీకే పెను సవాల్ విసిరింది. అయితే ఆ ప్రభంజనం ఆ వెలుగులు ఈ రోజు ఏవీ అన్న చర్చ సాగుతోంది.
భావోద్వేగాలతో పుట్టిన పార్టీలు ఒక లక్ష్యం తీరేంతవరకు మనుగడలో ఉంటాయి అని చెప్పడానికి ఈ రెండు పార్టీలే ఉదాహరణ అని అంటున్నారు. రెండు పార్టీలూ ఇపుడు ఉనికి పోరాటం చేస్తున్నాయనే అంటున్నారు. ఈ రెండు పార్టీలకు కొత్త నినాదాలు కావాలి. కొత్త రాజకీయ విధానాలూ కావాలి.
అపుడు కానీ అవి మళ్లీ దూకుడు కొనసాగించలేవు అని అంటున్నారు. ఈలోగా ఆ పార్టీలను ఖాళీ చేసి ఖతం చేయాలని ప్రత్యర్ధులు చూస్తున్నారు. సో ఇపుడు చూసుకుంటే కనుక కేసీఅర్ జగన్ ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు అని విశ్లేషిస్తున్నారు.