ఓట్ల తేడా 4.72 లక్షలే.. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన!

ముచ్చటగా మూడోసారి సీఎం కావాలన్న కేసీఆర్ కల చెదిరింది.. తెలంగాణపై మూడోసారీ గులాబీ జెండా ఎగురవేయాలన్న వ్యూహం బెడిసింది.

Update: 2023-12-04 08:45 GMT

ముచ్చటగా మూడోసారి సీఎం కావాలన్న కేసీఆర్ కల చెదిరింది.. తెలంగాణపై మూడోసారీ గులాబీ జెండా ఎగురవేయాలన్న వ్యూహం బెడిసింది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ పవర్ లోకి వచ్చింది. 64 సీట్లతో హస్తం పార్టీ పీఠం దక్కించుకోనుంది. హోరాహోరీ పోరులో కారు 39వ మైలురాయి దగ్గరే ఆగిపోయింది. మిత్రపక్షం సీపీఐ సీటునూ కలుపుకొంటే కాంగ్రెస్ బలం 65 సీట్లు అనుకోవాలి.

71.34 ఓటింగ్

గత గురువారం జరిగిన తెలంగాణ ఎన్నికల పోలింగ్ లో 71.34 శాతం మంది ఓటేశారు. ఆదివారం వెల్లడైన ఫలితాల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కాంగ్రెస్ కు కోల్పోయిన సంగతి తెలిసిందే. కారు పార్టీ 39 సీట్ల వద్ద ఆగిపోగా, కాంగ్రెస్ 64 సీట్లు సాధించింది. అయితే, పోలయిన ఓట్లలో 39.89 శాతం కాంగ్రెస్ దక్కించుకుంది. బీఆర్ఎస్ కు 38.08 శాతం ఓట్లు పడ్డాయి. అంటే.. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 1.81 శాతమే.

40 శాతం దాటని పార్టీలు

ఈ ఎనికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 40 శాతం ఓట్లను కూడా సాధించలేదు. అయితే, 2018 నాటి ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కు 47.4 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే.. నాడు ఆ పార్టీ 88 సీట్లను గెలిచింది. దీంతోనే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చినవి 64 స్థానాలే. బీఆర్ఎస్ కంటే 15 ఎక్కువ. అదే 2018లో కాంగ్రెస్ నెగ్గింది 19 సీట్లే.

కాంగ్రెస్‌ కు 91,86,837.. బీఆర్‌ఎస్‌ కు 87,14,040

కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఓట్ల శాతంలో పెద్దగా వ్యత్యాసం లేదు. లెక్కగా చెప్పాలంటే.. కాంగ్రెస్‌ కు బీఆర్‌ఎస్‌ కంటే 2 శాతానికి కాస్త ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లున్నారు. కాంగ్రెస్‌ కు 91,86,837, బీఆర్‌ఎస్‌ కు 87,14,040, బీజేపీకి 32,35,583 ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు 5,15,809, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ కు 1,46,079, బీఎస్పీకి 3,20,554, సీపీఐకి 80,336, సీపీఎంకు 51,828, ఇతరులకు 8,98,010, నోటాకు 1,70,956 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ –బీఆర్ఎస్ మధ్య మొత్తంగా ఓట్ల తేడా చూస్తే 4.72 లక్షలే. ఐదేళ్ల కిందటి కంటే కాంగ్రెస్‌ కు 10.97 శాతం ఓటింగ్‌ పెరిగింది. ఈఆ మేరకు బీఆర్‌ఎస్‌ కు 9.52 శాతం ఓటింగ్‌ తగ్గింది. కాగా, 2018లో కాంగ్రెస్‌ 28.43 శాతం ఓటింగ్‌తో 19 సీట్లకు పరిమితమైంది.

లాభపడింది బీజేపీ.. కానీ

తాజా ఎన్నికల్లో బీజేపీకి దాదాపు 14 శాతం ఓట్లు 8 సీట్లు వచ్చాయి. అయితే, ఏంలాంభం..? కీలక నేతలంతా ఓడిపోయారు. కొత్తవారు వచ్చారు. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లతో బీజేపీ ఒక్కటే సీటు నెగ్గింది కమలం పార్టీ. ఈసారి ఓట్లు రెట్టింపు చేసుకున్నా.. ఫాయిదా కనిపించని పరిస్థితి.

Tags:    

Similar News

ఇక ఈడీ వంతు