బీఆర్ఎస్ కు షాకిస్తున్న కాంగ్రెస్

తెలంగాణలో వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యం బీఆర్ఎస్ ది. పార్టీని గెలిపించేందుకు కేసీఆర్ కసరత్తుల్లో మునిగిపోయారు

Update: 2023-09-26 10:49 GMT

తెలంగాణలో వరుసగా మూడో సారి అధికారంలోకి రావాలన్న లక్ష్యం బీఆర్ఎస్ ది. పార్టీని గెలిపించేందుకు కేసీఆర్ కసరత్తుల్లో మునిగిపోయారు. కానీ ముచ్చటగా మూడోసారి సీఎం కావాలన్న కేసీఆర్ ఆశలపై నీళ్లు పోసేలా ఓ పెద్ద అడ్డంకి ఎదురువుతోంది. అదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో జోరుమీదున్న కాంగ్రెస్ ఈ సారి కచ్చితంగా అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో పార్టీకి ఏర్పడుతున్న సానుకూల పవనాలను మరింత బలంగా మార్చుకునే దిశగా కాంగ్రెస్ వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు వరుసగా షాక్లు ఇస్తోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుందని భావించి ఇతర పార్టీల నేతలు హస్తం గూటికి చేరడంలో ఓ అర్థం ఉంది. కానీ అధికార బీఆర్ఎస్ నుంచి కూడా కాంగ్రెస్ లోకి భారీగా వలసలు ఉన్నాయంటే మాత్రం అందుకు టీపీసీసీ నాయకుల వ్యూహాలే కారణమని చెప్పాలి. బీఆర్ఎస్ లో అసంత్రుప్తితో, నిరాశతో ఉన్న నాయకులకు, అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలను కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవడంలో విజయవంతమవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ విషయంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారనే చెప్పాలి. పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు బీఆర్ఎస్ నుంచి వచ్చేయడంతోనే కాంగ్రెస్ లో జోష్ మొదలైందని చెప్పాలి. అనంతరం సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వర రావు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

బీఆర్ఎస్ ఒకేసారి 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్ఠానం బుజ్జగిస్తున్నా నాయకులు వినడం లేదనే చెప్పాలి. తన కొడుక్కి టికెట్ ఇవ్వలేదనే కారణంతో మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయించుకున్నారని తెలిసింది. తాజాగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని సమాచారం. ఇక ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన అనిల్ కుమార్ రెడ్డి తిరిగి హస్తం గూటికే చేరతానని ప్రకటించారు. ఇలా బీఆర్ఎస్కు కాంగ్రెస్ వరుసగా షాక్లిస్తూనే ఉంది.

Tags:    

Similar News