ప్రచారం పీక్ లో.. వాన సాకుతో హైదరాబాద్ లో బీఆర్ఎస్ సభ రద్దు.. ఆంతర్యం?

జన సమీకరణ చేపట్టి.. ఆ వేదికలపై ప్రసంగాల ద్వారా ప్రత్యర్థులను విమర్శిస్తూ, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో గట్టిగా చెప్పేందుకు మంచి అవకాశం.

Update: 2023-11-25 12:30 GMT

తెలంగాణలో ఎన్నికల ప్రచారం మాంచి జోరుమీదుంది. మరొక్క నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఆ తర్వాత సైలెన్స్ పిరియడ్. ఈ నెల 30న పోలింగ్.. అంటే, సరిగ్గా వారం రోజుల్లో ఓటరు తన నిర్ణయం ఏమిటో చెప్పబోతున్నాడు. ఈ లెక్కన చూస్తే.. శని, ఆది, సోమ, మంగళవారాలు ప్రచారానికి అత్యంత కీలకం. ఈ వ్యవధిలో ఓటరు నిర్ణయాన్ని ప్రభావితం కూడా చేయొచ్చు. తమ విధాన ప్రకటనలతో పార్టీలు వారిని ఆకట్టుకోవచ్చు. ఈ క్రమంలో పార్టీలకు అతి ముఖ్యమైనవి బహిరంగ సభలు. జన సమీకరణ చేపట్టి.. ఆ వేదికలపై ప్రసంగాల ద్వారా ప్రత్యర్థులను విమర్శిస్తూ, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో గట్టిగా చెప్పేందుకు మంచి అవకాశం.

మూడు పార్టీలు.. ముప్పేట

తెలంగాణలో ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్నవి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. వీటి అగ్రనేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మూడు పార్టీల నాయకులూ బిజిబిజీగా ఉన్నారు. బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు నడ్డా అయితే.. శనివారం రాష్ట్రంలోనే ఉన్నారు. ఓ జాతీయ పార్టీ ముగ్గురు ముఖ్య నేతలు, అందులోనూ ప్రధాని, కేంద్ర హోం మంత్రి స్థాయి వ్యక్తులు ఒకే రోజున ఒకే రాష్ట్రంలో ఉండడం అరుదనే చెప్పాలి. మోదీ, షా, నడ్డా ముగ్గరు నేతలు శనివారం 9 సభల్లో పాల్గొననున్నారు. ఇది ఓ రకంగా రికార్డు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సైతం శనివారం ఉమ్మడి ఖమ్మంలో పలు సభల్లో పాల్గొనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వంటి కీలక నాయకులూ రాష్ట్రంలోనే ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రాజా ఆశీర్వాద సభల పేరుతో ప్రజల్లోకి వెళ్తోంది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఒకే రోజు పలు సభల్లో పాల్గొంటున్నారు. ఇంతటి తీవ్ర స్థాయి ప్రచారంలో బీఆర్ఎస్ అనూహ్యం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ లో ఎందుకు రద్దుచేశారో?

షెడ్యూల్ ప్రకారం శనివారం హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాల్సి ఉంది. నగరంలోని నియోజకవర్గాలన్నిటికీ కలిపి ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని భావించారు. అయితే, వర్షాలను కారణంగా చూపి సభను రద్దు చేశారు. అధికార పార్టీ స్థాయిలో ఇది అనూహ్య నిర్ణయమే. మరోవైపు ఈ నెల 28లోగా ఈ సభను నిర్వహించడం లేదు. అంటే.. జంట నగరాల పరిధిలో బీఆర్ఎస్ సభనే లేదు అన్నమాట. అయితే, శనివారం నగరంలో కేటీఆర్ మలక్ పేట, గోషామహల్ లో రోడ్ షోలలో పాల్గొననున్నారు. విచిత్రం ఏమంటే.. ఈ రెండూ ఎంఐఎం, బీజేపీకి గెలుపు అవకాశం ఉన్న నియోజకవర్గాలు.

సంకేతాలు అందినందున సమీక్షకు

ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ కు నివేదికలు అందినట్లుగా సమాచారం. దీంతోనే ఆయన అత్యవసరంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ సభను రద్దు చేసి సమీక్షకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ప్రస్తుత పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష చేపట్టనున్నట్లుగా చెబుతున్నారు. బహిరంగ సభ పెట్టుకుంటే.. సమయం చిక్కదని, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదని భావించే రద్దుకు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. వాస్తవానికి హైదరాబాద్ లో శుక్రవారం సాధారణ కంటే చాలా తక్కువ స్థాయిలో వర్షం పడింది. అతి భారీ వర్షాన్ని చూసిన నగరానికి ఇదో వాననే కాదు. ట్రాఫిక్ జామ్ లు కానీ.. నాలాలు పొంగడం కానీ.. ఇతరత్రా అవాంతరాలు కానీ లేనే లేవు. కానీ, దీనినే కారణంగా చూపి బీఆర్ఎస్ సభను రద్దు చేయడం గమనార్హం.

Tags:    

Similar News