స్టార్‌ హీరో పార్టీకి ఏనుగు తెచ్చిన తంటా!

ఇళయ దళపతిగా అభిమానులు పిలుచుకునే తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-01 11:32 GMT

ఇళయ దళపతిగా అభిమానులు పిలుచుకునే తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో ఆయన పార్టీని ఏర్పాటు చేశారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తుందని ప్రకటించారు. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికల ముందే పార్టీని ఏర్పాటు చేసినా ఆ ఎన్నికల్లో టీవీకే పోటీ చేయలేదు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తమ లక్ష్యమని.. అప్పటికి పార్టీని బలోపేతం చేసుకుంటామని విజయ్‌ ప్రకటించారు.

కాగా తమిళగ వెట్రి కజగం పార్టీ.. మూడు రంగాల జెండాను కలిగి ఉంది. ఇందులో పైన, కింద ఎరుపు రంగు, మధ్యలో పసుపు రంగు ఉంటుంది. ఈ మూడింటి మధ్యలో నక్షత్రాలతో కూడిన ఒక పువ్వు ఉంటుంది. అలాగే దానిచుట్టూ రెండు ఏనుగులు ఉంటాయి,

ఈ నేపథ్యంలో విజయ్‌ పార్టీ ఏర్పాటు సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించినప్పుడే వివాదం రేగింది. పార్టీ జెండాలో ఏనుగులు ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దేశంలో జాతీయ పార్టీల్లో ఒకటిగా ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) గుర్తు ఏనుగు అనే సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీఎస్పీ.. విజయ్‌ పార్టీ జెండాపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏనుగు గుర్తును ఎన్నికల సంఘం తమకు కేటాయించిందని.. ఇతర పార్టీలేవీ ఆ గుర్తును వాడటానికి వీల్లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

తమ పార్టీ గుర్తునే విజయ్‌ తన పార్టీకి వినియోగించడం వల్ల ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని బీఎస్పీ అంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీఎస్పీ తమిళనాడు శాఖ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

మరో పార్టీ ఏనుగు గుర్తును ఉపయోగించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. విజయ్‌ పార్టీ.. టీవీకే జెండా నుంచి ఏనుగును తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.

ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం తమ వైఖరిని స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. రిజిస్టర్డ్‌ పార్టీలకు తాత్కాలిక పద్ధతిలో గుర్తును కేటాయిస్తున్నామని తెలిపింది. ఇదే అధికార గుర్తు కాదని స్పష్టం చేసింది. జెండా వేరు, ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి కేటాయించే గుర్తు వేరని తెలిపింది. ఎన్నికల ముందు పార్టీ గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. జెండా వివాదంలో తాము జోక్యం చేసుకోబోమని.. పార్టీ గుర్తుల విషయంలోనే తమ జోక్యం ఉంటుందని స్పష్టం చేసింది.

Tags:    

Similar News