జనసేన తోడుగా ప్రచారం.. టి-బీజేపీ తలనొప్పి వ్యవహారం!

అక్కడ టీడీపీ-జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయించాయి కాబట్టి.. ఆ కూటమిలో బీజేపీనీ కలుపుకొని పోవాలని చూస్తున్నాయి.

Update: 2023-11-03 11:30 GMT

అత్యంత కీలకమైన ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేసిన రాష్ట్ర అధ్యక్షుడిని మార్చి చేజేతులా తెలంగాణలో వెనుకబడిపోయింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ). ఆపైన అయినా తప్పును దిద్దుకుంటోందా? అంటే అదీ లేదు. ఒక్కొక్క నాయకుడు పార్టీని వీడుతూ విమర్శలకు దిగుతున్నారు. క్రమశిక్షణ కలిగిన నాయకత్వానికి పెట్టింది పేరైన బీజేపీయేనా? ఇది అనిపించేలా చేస్తున్నారు. ఎన్నికలు నెల రోజులు కూడా లేనప్పటికీ తెలంగాణలో ఇంకా ప్రచారంలో జోరు పెంచలేదు. మరోవైపు ఇతర పార్టీలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి దూసుకుపోతుంటే కాషాయ దళం మాత్రం పొత్తులు అంటూ ప్రయత్నాలు సాగిస్తోంది.

జనసేన తోడ్పాటు అవసరమా?

ఏపీలో అంటే పవన్ కల్యాణ్ సారథ్యంలోని జన సేన ప్రభావం చూపగల స్థాయిలో ఉంది. అక్కడ టీడీపీ-జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయించాయి కాబట్టి.. ఆ కూటమిలో బీజేపీనీ కలుపుకొని పోవాలని చూస్తున్నాయి. కానీ, తెలంగాణలోనూ జనసేనను పట్టుకుని వేలాడుతోంది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ, జాతీయ ఓబీసీ సెల్ చైర్మన్ డాక్టర్ కె.లక్ష్మణ్ తాజాగా సైతం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలోని జన సేనను కలుపుకొని వెళ్తామంటూ ప్రకటించారు. పవన్ తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయబోతున్నట్లు తెలిపారు.

గత ఎన్నికల పాఠం గుర్తులేదా?

జనసేన కానీ, టీడీపీ కానీ, ఆఖరికి వైసీపీ అయినా సరే పూర్తి సీమాంధ్ర పార్టీలే. తెలంగాణ ఏర్పడిన తొమ్మిదేళ్ల తర్వాత కూడా ఈ విషయం చెప్పకతప్పడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి మహా కూటమి అంటూ వస్తే, తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమాంతం అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. చంద్రబాబును బూచిగా చూపి సెంటిమెంట్ రెచ్చగొట్టారు. అయినా, బీజేపీ నాటి ఉదంతాన్ని గుణపాఠంగా తీసుకోలేకపోతోంది.

టీడీపీనే లేదు.. జనసేన ఎందుకు?

తెలంగాణలో పరిస్థితులను ఊహించి.. ప్రస్తుతం ఏపీలోని తన ఇబ్బందులను గ్రహించిన టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పూర్తిగా దూరంగా ఉంటామని ప్రకటించింది. ఇక నిన్నమొన్నటిదాక హడావుడి చేసిన వైఎస్ షర్మిల తన పార్టీ వైటీపీ తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటుందని ప్రకటించారు. కానీ, జనసేన మాత్రమే ఇప్పటికీ తెలంగాణలో పోటీ చేస్తామంటూ చెబుతోంది. అది కూడా బీజేపీతో కలిసి. దీనినే అవకాశంగా తీసుకున్న బీజేపీ ఆ పార్టీని పట్టుకుని వదలడం లేదు.

జనసేనకు కాదు.. బీజేపీకే దెబ్బ

తెలంగాణలో పోటీ ద్వారా వాస్తవానికి జనసేనకు పోయేదేం లేదు. దెబ్బ తగిలేది బీజేపీకే అనేది వాస్తవం. అందులోనూ కేసీఆర్ వంటి నాయకుడికి చేతులారా అవకాశం ఇచ్చిన బీజేపీకి.. జనసేనతో కలిసి వెళ్తే విమర్శలకు తావిచ్చినట్లు అవుతుంది. పక్కా ఆంధ్రా పార్టీగా ముద్ర వేసుకున్న జనసేనకు తెలంగాణలో బలమూ తక్కువే. అభిమానులు ఉన్నప్పటికీ వారు ఓటేయడం కష్టమే. ఏతావాతా చెప్పేది ఏమంటే జనసేనను భుజాన వేసుకెళ్లే ప్రయత్నంలో తెలంగాణ బీజేపీ బొక్కాబోర్లా పడుతోంది.

Tags:    

Similar News