అభ్యర్ధులకు షాక్ తగులుతోందా ?

మంచిర్యాల, చేవెళ్ళ, సత్తుపల్లి, వర్ధన్నపేట, జహీరాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో అయితే ఎంఎల్ఏలను జనాలు తమ గ్రామాల్లోకి అడుగు కూడా పెట్టనీయలేదు. కారణం ఏమిటంటే పథకాలు అర్హులకు అందకపోవటమే.

Update: 2023-10-25 05:07 GMT

ఎన్నికల తేదీ దగ్గరకొస్తున్న నేపధ్యంలో అధికారపార్టీ ఎంఎల్ఏలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ప్రచారంలో భాగంగా క్షేత్రస్ధాయిలో పర్యటించాలని అనుకుంటున్న ఎంఎల్ఏలు, ఎంఎల్ఏ అభ్యర్ధులకు స్ధానిక నేతలు షాకులిస్తున్నారు. గ్రామాలు, మండల కేంద్రాల్లో మీటింగుల ఏర్పాటుకు ససేమిరా అంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే సంక్షేమపథకాల అమలులోని అస్తవ్యస్ధ విధానాలే. ఏ పథకం కూడా సంపూర్ణంగా అర్హులకు అందుతున్నది లేదు. దాంతో తమ దగ్గరకు వస్తున్న అధికారపార్టీ నేతలను జనాలు నిలదీస్తున్నారు.

జనాల నిలదీతలకు భయపడుతున్న ద్వితీయ శ్రేణినేతలు అసలు మీటింగులను ఏర్పాటు చేయాలంటేనే భయపడిపోతున్నారు. మంచిర్యాల, చేవెళ్ళ, సత్తుపల్లి, వర్ధన్నపేట, జహీరాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో అయితే ఎంఎల్ఏలను జనాలు తమ గ్రామాల్లోకి అడుగు కూడా పెట్టనీయలేదు. కారణం ఏమిటంటే పథకాలు అర్హులకు అందకపోవటమే. పథకాలు అందటంలేదని కాళ్ళు అరిగేలా జనాలు ఐదేళ్ళు మంత్రులు, ఎంఎల్ఏల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎవరు పట్టించుకోలేదు. దాంతో ఎన్నికల్లో ఓట్లకోసం తమ దగ్గరకు వస్తున్న అభ్యర్ధులపై జనాలు మండిపోతున్నారు.

తమకు పథకాలు అందని వైనాన్ని జనాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అభ్యర్ధుల సమాధానాలను వినటానికి కూడా జనాలు ఇష్టపడటంలేదు. పైగా అభ్యర్ధులతో మీటింగ్ ఏర్పాటుచేసిన ద్వితీయ శ్రేణి నేతలపైన కూడా మండిపోతున్నారు. 24 గంటలూ జనాల మధ్యలోనే ఉండాల్సిన స్ధానిక నేతలు తమకెందుకొచ్చిన సమస్యంటు తప్పించుకుని తిరుగుతున్నారు. అభ్యర్ధులు ఎంతగా ఒత్తిళ్ళు తెస్తున్నా ద్వితీయశ్రేణి నేతలు మీటింగులను మాత్రం ఏర్పాటుచేయటంలేదట.

అభ్యర్ధులు రెడీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు మీటింగులు ఏర్పాటుచేయటంలేదన్న ఫిర్యాదులను కేటీయార్ దృష్టికి వెళుతున్నాయి. దాంతో మంత్రి స్వయంగా ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడి సమావేశాలు ఏర్పాటుకు ఒత్తిడి చేయాల్సొస్తోంది. అయినా పెద్దగా ఫలితం ఉన్నట్లు అనిపించటంలేదు. సిట్టింగ్ ఎంఎల్ఏలు అభ్యర్ధులుగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పథకాల్లో లబ్దిదారుల నుండి కమీషన్లు తీసుకోవటం, అర్హులను కాదని అనర్హులకు పథకాలను వర్తింపచేసిన ఫలితంగానే ఇపుడు జనాల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సొస్తోందని పార్టీవర్గాల సమాచారం. బీసీ బంధు, రైతు బంధు, రైతురుణమాఫీ ఇలా ఏ స్కీం తీసుకున్నా ఇదే తీరు. అందుకనే జనాలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News