పవన్ మీద బరువైన బాధ్యతలు

పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎట్టకేలకు పవన్ తాను అనుకున్న చోటకు చేరుకున్నారు.

Update: 2024-06-15 03:45 GMT

పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎట్టకేలకు పవన్ తాను అనుకున్న చోటకు చేరుకున్నారు. అధికారం ఇస్తే తాను ఏంటో సాధించి చూపిస్తాను అని తరచూ చెప్పే పవన్ కి ఇపుడు ఆ చాన్స్ వచ్చింది. ఆయన మీద చంద్రబాబు కరుణా కటాక్షాలు కురిపించారు అనే చెప్పాలి.

ఏకంగా అత్యంత కీలకమైన శాఖలనే పవన్ కి అప్పగించారు. పంచాయతీరాజ్ అన్నది అతి ప్రధానమైన శాఖ. అలాగే గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, అడవులు వంటి ఉప శాఖలతో పవన్ కి మంచి అవకాశం వచ్చింది. పవన్ చేతిలో ఉన్న శాఖలు అన్నీ నిత్యం ప్రజలతో ముడిపడి ఉన్నవే.

ఏపీలో నూటికి డెబ్బై శాతం గ్రామీణ ప్రాంతం ఉన్న నేపధ్యంలో పవన్ కి పని చాలానే ఉంటుంది అని అంటున్నారు. పంచాయతీ రాజ్ అంటే కేంద్ర ప్రభుత్వంలో అనుసంధానం అయి నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో తాగు నీరు రోడ్లు ఇతర సదుపాయాల కల్పనతో పాటు గ్రామ స్వరాజ్యం తెచ్చే కీలక శాఖలు ఇవే.

క్షణం తీరిక లేని పని ఉంటుంది. సాధారణంగా చూస్తే ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తెలుగుదేశం అయినా పంచాయతీ రాజ్ శాఖ అంటే రాజకీయాల్లో విశేష అనుభవం ఉన్న వారికి ఇచ్చేవారు. అలా ఉమ్మడి ఏపీలో జేసీ దివాకర్ రెడ్డి కాంగ్రెస్ లో ఈ శాఖను చూసారు. ఇక విభజన ఏపీలో టీడీపీలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చూసారు. వైసీపీ హయాంలో బూడి ముత్యాలనాయుడు, ఆయన కంటే ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ శాఖలను చూసారు.

ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ శాఖలను చంద్రబాబు పవన్ కి ఇచ్చారు. దాంతో పవన్ కి చేతి నిండా పనే ఉంటుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఆయన సినిమాలు ఇంకా షూటింగ్ దశలో కొన్ని ఉన్నాయని అంటున్నారు. మరి వాటిని పూర్తి చేస్తూ ఆయన మంత్రిగా బాధ్యతలు చూసుకుంటూ రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాల్సి ఉంది.

అదే విధంగా చూస్తే పవన్ తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన తరువాత పూర్తిగా పాలనకే పరిమితం అవుతారు అని అంటున్నారు. పవన్ కి కేంద్ర ప్రభుత్వంతో కూడా మంచి పరిచయాలు ఉన్న క్రమంలో పంచాయతీ రాజ్ శాఖకు ఆయన కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకుని వస్తారు అని అంటున్నారు. మొత్తానికి పవన్ కి బరువైన బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు.

Tags:    

Similar News