అలా జరిగి ఉంటే.. నేను ఓట అడిగే వాడిని కాదు: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
వైసీపీలో సామాన్యులకు టికెట్లు ఇచ్చారని డబ్బా కొంటున్నారని.. చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ``రాష్ట్రంలో అంతా బాగుండి ఉంటే.. ప్రజలు సంతోషంగా ఉండి ఉంటే.. ఈ ఐదేళ్ల సైకో పాలనలో అందరూ సఖసంతోషాలతో ఉండి ఉంటే.. తాను ఇప్పుడు రోడ్ల వెంట తిరుగతూ ఓట్లు అడిగేవాడిని కాదు`` అని వ్యాఖ్యానించారు. నిజానికి చంద్రబాబు నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలుఇప్పటి వరకు రాలేదు. కానీ, తాజాగా ఆయన ప్రచారంలో కొత్త పుంతలు చూపించారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌతాళంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో మాట్లాడారు.
రాష్ట్రంలో ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధి లేకుండాపోయిందని.. ఎవరైనా అభివృద్ధి చెందారని చెబితే.. అది ఒక్క వైసీపీ నాయకులు మాత్రమేనని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆవేదనలో ఉన్నారని.. రాజధాని లేని రాష్ట్రంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నారని.. అందుకే తాను కూటమిని గెలిపించాలని కోరుతున్నట్టు చంద్రబాబు తెలిపారు. ``రాష్ట్రంలో ఎక్కడ విన్నా కూటమి అభ్యర్థుల గెలుపు గురించే చర్చ సాగుతోంది. వారు గెలిచారనే ప్రజలు చెబుతున్నారు. ఇక్కడ కర్నూలులో ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాల్లో కూటమి అభ్యర్థులదే విజయం. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు`` అని చంద్రబాబు అన్నారు.
వైసీపీలో సామాన్యులకు టికెట్లు ఇచ్చారని డబ్బా కొంటున్నారని.. చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీలో ఎవరికి ఇచ్చారో అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆస్తిపాస్తులు లేకపోయినా తాము కూడా.. సామాన్య కార్యకర్తలకు టికెట్లు ఇచ్చామని చెప్పారు. కర్నూలు ఎంపీ టికెట్ ను కురుబ సామాజిక వర్గానికి చెందిన సాధారణ ఎంపీటీసీ నాగరాజుకు ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి ఓ సామాన్యుడని తెలిపారు. ఈ విషయాలు వైసీపీకి తెలియకపోయినా.. ప్రజలకు తెలుసునని అన్నారు.
వైసీపీ వస్తే.. మరోసారి ప్రజలు మోసపోతారని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికే అన్ని ధరలు పెరిగిపోయాయని, సామాన్యు లు కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే.. ధరలు పెంచబోమని ఆయన హామీ ఇచ్చారు. కరెంటు చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ గమనించాలని.. దృష్టిలో పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. సైకో పాలనకు అంతం పలకాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.