ముఖ్యమంత్రిగా బాబు మార్చుకోవాల్సిన మొదటి అలవాటు ఇదేనట!

ఈ తీరు ఇప్పుడే కాదు.. మొదట్నించి ఉంది. దీనిపై తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది.

Update: 2024-06-13 16:30 GMT

మారిన చంద్రబాబును చూస్తారంటూ ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టటానికి ముందు నుంచి టీడీపీ అధినేత పలుమార్లు పలు వేదికల మీద చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు తగ్గట్లే ఆయనలో మారిన తీరు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. అన్నీ బాగానే ఉన్నా.. ఒక విషయంలో మాత్రం మార్పు పక్కాగా ఉండాలన్న మాట వినిపిస్తోంది. విపక్షనేతగా ఉన్నప్పుడు.. ప్రత్యేక విమానం కాకుండా మామూలు విమానంలో ప్రయాణించటం చాలాసార్లు చూశాం. కానీ.. ముఖ్యమంత్రి అయినంతనే ప్రత్యేక విమానాన్ని వాడటం కనిపిస్తుంది.

ఈ తీరు ఇప్పుడే కాదు.. మొదట్నించి ఉంది. దీనిపై తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రత్యేక విమానాన్ని ఎడాపెడా వాడేసే చంద్రబాబు.. విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్ విమానాల్లో ప్రయాణిస్తుంటారు. అదే తీరును అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫాలో కావొచ్చు కదా? అన్నది చర్చగా మారింది. తాజాగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం కుటుంబ సమేతంగా తిరుపతికి వెళ్లటం తెలిసిందే.

ఈ సందర్భంగా ప్రత్యేక విమానాన్ని వినియోగించారు. విపక్ష నేతగా ఉన్నప్పుడు ఎలా అయితే సాదాసీదాగా వ్యవహరిస్తారో.. అలాంటి తీరునే సీఎంగా ఉన్నప్పుడు వ్యవహరిస్తే ఆయనో రోల్ మోడల్ గా నిలుస్తారని చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టైం దొరకదని.. ప్రత్యేక విమానాన్ని వినియోగించటం ద్వారా సమయాన్ని ఆదా చేయొచ్చని చెబుతారు. మనసు ఉంటే మార్గం ఉంటుందన్నట్లుగా.. ప్రత్యేక విమానం ద్వారా ఆదా చేసే సమయాన్ని.. మామూలు విమానాల్లో ప్రయాణిస్తూ కూడా చేయొచ్చని చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ .. కాలు తీసి బయటకు అడుగు తీస్తే చాలు ప్రత్యేక విమానాన్ని వినియోగించేవారు. చివరకు తన పంటి చికిత్స కోసం ఢిల్లీకి వెళ్లేటప్పుడు ప్రత్యేక విమానాన్ని వాడటం తెలిసిందే. అందుకు భిన్నంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎంగా స్పెషల్ ఫ్లైట్లను చాలా చాలా ప్రత్యేక సందర్భాల్లోనే వినియోగిస్తున్నారు. సాదా సీదాగా విమానాల్లో ఆయన జర్నీ చేస్తున్నారు.

కేసీఆర్ తో పోలిస్తే ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి రేవంతే ఎక్కువసార్లు వెళుతున్నారు. వెళ్లిన ప్రతిసారీ సాధారణ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. తన శిష్యుడు అనుసరిస్తున్న మార్గాన్ని చంద్రబాబు కూడా అనుసరిస్తే బాగుంటుందని చెబుతున్నారు. ఒకవేళ విపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానాల్నివాడితే.. అధికారంలో ఉన్నప్పుడు వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకు భిన్నంగా చేతిలో పవర్ ఉన్నప్పుడు ఒకలా.. పవర్ లేనప్పుడు మరోలా బాబు వ్యవహరిస్తారన్న చెడ్డపేరు నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News