తిరుపతి మీద కేంద్ర హోం శాఖ ఫుల్ ఫోకస్
తిరుపతి అంతర్జాతీయ పుణ్య క్షేత్రం. ఏపీలో లోకేట్ అయి ఉన్నా కూడా జాతీయ స్థాయిలోనూ ప్రభుత్వాలు తిరుపతి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి.
తిరుపతి అంతర్జాతీయ పుణ్య క్షేత్రం. ఏపీలో లోకేట్ అయి ఉన్నా కూడా జాతీయ స్థాయిలోనూ ప్రభుత్వాలు తిరుపతి పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాయి. ఇదిలా ఉంటే తిరుపతిలో ఇటీవల వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చి టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు మరణించారు. ఇందులో ఇద్దరు తమిళనాడు కర్నాటకకు చెందిన వారు కావడంతో ఇది జాతీయ స్థాయిలోనూ కీలక అంశంగా మారింది
ఈ నేపధ్యంలో అసలు తిరుపతిలో ఏమి జరుగుతోంది అన్నది కేంద్రం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉన్న అత్యంత పవిత్రమైన హిందూ టెంపుల్ లో ఏ చిన్న విషయం జరిగినా అది క్షణాలలో వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతుంది. దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంలో ఏమి జరుగుతోంది అన్నది ఆరా తీసేందుకు కేంద్ర హోం శాఖను ప్రత్యేకంగా పురమాయించింది.
ఇక తిరుమలలో లడ్డూ కౌంటర్ దగ్గర అగ్ని ప్రమాదం జరగడం అలాగే అపచారాలు చోటు చేసుకోవడంతో వీటి మీద కూడా ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు. ఇక నాలుగైదు నెలల క్రితం తిరుమల లడ్డూలలో కల్తీ జరిగింది అన్న వార్తలతో ఏకంగా ఆధ్యాత్మిక ప్రపంచమే ఉలిక్కిపడింది.
దాని మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీని కూడా నియమించి దర్యాప్తు చేయిస్తున్నారు. అందులో కేంద్ర రాష్ట్ర అధికారులు ఉన్నారు. ఇదిలా ఉంటే తిరుమలలో వరస ఘటనల వెనుక కారణాలు తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ ఇపుడు నేరుగా రంగంలోకి దిగిందని చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ తిరుమలలో ఈ నెల 19, 20 తేదీలలో పర్యటించనున్నారని అంటున్నారు.
ఆయన పర్యటనలో తిరుపతి తొక్కిసలాట ఘటనతో పాటు, లడ్డూ కౌంటర్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారని అంటున్నారు. ఇక జిందాల్ తన పర్యటనలో టీటీడీ అధికారులతో కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ విధంగా రెండు రోజుల తన పర్యటనలో మొత్తం సమాచారాన్ని సేకరించి దానిని ఆయన కేంద్ర హోంశాఖకు నివేదిక అందించనున్నారని అంటున్నారు.
విశేషం ఏంటి అంటే కేంద్ర హోం శాఖ అడిషనల్ సెక్రటరీ జిందాల్ తిరుపతికి విచారణకు వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఏపీలోనే ఉండడం. మొత్తానికి చూస్తే తిరుపతి విషయంలో కేంద్రం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో అన్నది ఆసక్తిని రేపుతోంది.