ఒకరోజు కాదు.. రెండు రోజులు చంద్రబాబు 'ప్రచారం'
మరోవైపు బీజేపీ నాయకులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సి ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయించుకున్న ఏపీ సీఎం, టీడీ పీ అధినేత చంద్రబాబు.. ఆదివారంసాయంత్రం నుంచే ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే ముందుగా ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం.. ఆయన ఆదివారం ఒక్కరోజే ప్రచారం చేయాల్సి ఉంది. కానీ, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తన పర్యటనను రెండు రోజుల వరకు పొడిగించుకున్నారు. ఎన్నికల పోలింగ్‌కు సమయం తక్కువగా ఉండడంతో ఈ నిర్నయం తీసుకున్నారని తెలిసింది.
మరోవైపు బీజేపీ నాయకులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సి ఉంది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే చంద్రబాబు ప్రచారంలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ, కేంద్ర బడ్జెట్ అనంతర పరిణామాలతో బాబు పర్యటన ఆలస్యమైంది. ఆయన ఆదివారం రాత్రికి కానీ.. ఢిల్లీ చేరుకునే అవకాశం లేదు. అయితే.. అప్పటికే ఎన్నికల కోడ్ ప్రకారం ప్రచార సమయం ముగిసిపోతుంది. దీంతో సోమవారం ఉదయం నుంచి ఆయన ప్రచారం ప్రారంభించనున్నారు.
అయితే.. ఆదివారం సాయంత్రం మాత్రం ఓ హోటల్ నిర్వహించే కార్యక్రమానికి హాజరై.. తెలుగు ప్రము ఖులతో చంద్రబాబు ముచ్చటించనున్నారు. ఎన్డీయే పాలన, పెట్టుబడులు.. వంటి కీలక అంశాలపై వారితో చర్చించి.. సోమవారం ఉదయం పూర్తిస్థాయిలో ప్రచారం చేయనున్నారు. మొత్తం ఐదు నియోజక వర్గాల్లో మూడు సభలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రచారంలో బీజేపీ తరఫున బలమైన గళం వినిపించేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు.
తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లోని కీలక అంశాలను కూడా చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా.. చంద్రబాబు పర్యటనకు బీజేపీ నేతలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగు వారిని బీజేపీ వైపు నడిపిస్తారన్న ఆశలు పెట్టుకున్నారు.