వైసీపీలో చేరి అన్నీ అమ్ముకున్నానన్న జనసేన ఎమ్మెల్యే !
వైసీపీలో ఆయన రాజకీయ ప్రస్థానం దశాబ్దం కాలం కంటే ఎక్కువే. వైసీపీ పెట్టిన వెంటనే అందులో చేరి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు.
వైసీపీలో ఆయన రాజకీయ ప్రస్థానం దశాబ్దం కాలం కంటే ఎక్కువే. వైసీపీ పెట్టిన వెంటనే అందులో చేరి పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. అయినా పార్టీ కోసం తన ఆస్తులను అమ్ముకున్నానని కానీ రాజకీయంగా తాను పూర్తిగా ఇబ్బందులే ఎదుర్కొన్నాను అని అంటున్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీ క్రిష్ణ శ్రీనివాస్.
ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీలో తాను చేరి సర్వస్వం కోల్పోయాను అని అన్నారు. తాను మళ్ళీ రాజకీయంగా వైభవం చూస్తున్నాను అంటే అది జనసేన వల్లనే అని తానున్న పార్టీని అధినేత పవన్ కళ్యాణ్ ని గట్టిగా పొగిడారు. ఇంతకీ వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఎందుకు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారూ అంటే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ ఆ పార్టీ ఆయనను రాజకీయంగా టార్గెట్ చేస్తోంది. ఆయన మీద లిక్కర్ స్కాం అని ఆరోపణలు చేస్తోంది.
దాంతో పూర్తిగా ఆగ్రహంతో ఉన్న ఆయన తన మొత్తం రాజకీయ జీవితం మీడియా ముందు పెట్టారు. తనకు అసలు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని అన్నారు. ఆ సమయంలో ప్రజారాజ్యం అధినేత మెగాస్టార్ చిరంజీవి పిలుపుని అందుకుని రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పారు. ప్రజారాజ్యం తరువాత తాను సైలెంట్ గా ఉండిపోదామని అనుకుంటే వైసీపీ అధినాయకత్వమే తనను కోరి పదే పదే పిలిచి మరీ పార్టీలో చేర్చుకుందని అన్నారు.
అలా వైసీపీలోకి వచ్చిన తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను అన్నారు. తనకు ఉన్న భూములను ఆస్తులను తెగనమ్ముకుని పార్టీ కోసం పనిచేశాను అని వంశీ క్రిష్ణ ఫ్లాష్ బ్యాక్ ని వినిపించారు. తాను ఏకంగా అరవై ఎకరాల భూమిని వైసీపీ కోసం అమ్మేశాను అన్నారు. కోట్లాది రూపాయలు వైసీపీ మీడియాకు యాడ్స్ రూపంలో ఇచ్చానని చెప్పారు.
అలా ఆనాడు విశాఖలో పార్టీని పెంచి పెద్దగా చేసిన తాను వైసీపీ నేతలకు మంచి వారిగా ఉన్నానని ఇపుడు జనసేనలో చేరగానే అవినీతిపరుడిని చెడ్డవాడిని ఎలా అయిపోయానో వారే చెప్పాలని నిలదీశారు. తన మొత్తం రాజకీయ జీవితంలో జనసేనలో ఉన్నపుడే సంతోషంగా ఉన్నాను అన్నారు. తనకు రాజకీయ వైభోగాన్ని జనసేన ఇచ్చిందని ఆయన అన్నారు.
వైసీపీలో అన్నీ కష్టాలే పడ్డానని అయోమయంగా తన రాజకీయాన్ని మార్చారని ఆయన విమర్శించారు. తాను ఏ ఒక్క తప్పూ చేయలేదని తన మీద వైసీపీ నేతలు చేసిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటాను అని ఆయన స్పష్టం చేయడం విశేషం. ఇదిలా ఉంటే వైసీపీని నిలబెట్టేందుకు ఆస్తులు అన్నీ అమ్ముకున్నానని జనసేన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఆయన ఎమ్మెల్యే కావాలని కోరుకుంటే 2014లో మాత్రమే టికెట్ ఇచ్చారని 2019, 2024లో ఇవ్వలేదని, ఆఖరికి విశాఖ మేయర్ సీటు ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చినా తమ నేతకు సరైన ఫోకస్ లేదని అందుకే జనసేనలో చేరి ప్రజా నాయకుడిగా ఉన్నారని అంటున్నారు. ఇక తన ఆస్తులు అన్నీ అమ్ముకుని ఇపుడు ఒక సాధారణ జీవితాన్ని తాను గడుపుతున్నాను అని వంశీ క్రిష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి.