ముద్రగడ ఇంటిపై దాడి.. ఎవరు చేశారు? ఎందుకు?
వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరిగింది.
వైసీపీ నాయకుడు, కాపు ఉద్యమ మాజీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరిగింది. ఆది వారం ఉదయం ముద్రగడ ఇంటిపై ఓ వ్యక్తి దాడికి దిగాడు. ఇంట్లోకి ప్రవేశించి ఫర్నిచర్‌ను , అద్దాలను ధ్వంసం చేశాడు. ముద్రగడ ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన నిందితుడు పార్కింగ్ చేసిన కారుతో పాటు ఫ్లెక్సీలు ధ్వంసం చేశాడు. దీంతో భీతిల్లిన ముద్రగడ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచా రం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు స్థానికంగా.. ఉన్న ఓవ్యక్తేనని గుర్తించారు. గన్నిశెట్టి గంగాధర్ అనే వ్యక్తి పూటుగా మందు కొట్టి.. ట్రాక్టర్‌పై వచ్చి.. ఈ భీభత్సం సృష్టించినట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న గంగాధర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే.. దీనివెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని పోలీసులు తెలిపారు. ఇక, ఈ విషయం తెలిసిన వెంటనే ముద్రగడ అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే పోలీసులు నిందితుడిని స్టేషన్‌కు తరలించారు.
తొలుత రాజకీయం!
ముద్రగడ నివాసంపై దాడి జరిగిందని తెలియగానే.. దీనివెనుక కూటమి పార్టీల నాయకుల హస్తం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే.. సంయమనం పాటించాలంటూ ముద్రగడ తేల్చిచెప్పడంతోపాటు.. పోలీసులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత.. ఈ ఘటన వెనుక ఎలాంటి రాజకీయం లేదని పేర్కొన్నారు. దీంతో ముద్రగడ అనుచరులు శాంతించారు. ఇదిలావుంటే, సదరు వ్యక్తి దాడి ఎందుకు చేశారన్న వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ వ్యవహారం తూర్పు గోదావరిలో సంచలనంగా మారింది.
గతంలోనూ..
గతంలోనూ రెండు సార్లు ముద్రగడ ఇంటిపై దాడులు జరిగాయి. ఒక వ్యక్తి రాళ్లు రువ్వడంతో ఇంటి అద్దా లు పగిలిపోయాయి. అప్పట్లో కాపు ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న కొందరు ఈ దాడిని ప్రోత్సహించారన్న ఆరోపణలు వచ్చాయి. ఇక, ఆ తర్వాత మరోసారి 2019 ఎన్నికలకు ముందు కూడా దాడి జరిగింది. అప్పట్లోనూ పెద్దగా ఎలాంటి విధ్వంసం జరగకపోయినా.. ముద్రగడ కేంద్రంగా మాత్రం దాడులు కొనసాగుతున్నాయనడానికి తాజా దాడి ఉదాహరణగా మారింది.