మోడీ వారసుడిని కాను....అక్కడికే పోవాల్సిందే !

ఇదిలా ఉంటే యోగీ ఆదిత్యనాథ్ తాజాగా ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్నారు. ఆయన మీద అనేక ప్రశ్నలను యాంకర్ సంధించినపుడు కూల్ గానే జవాబు చెప్పారు.;

Update: 2025-03-09 10:30 GMT

ఆయన అనూహ్యంగా దేశంలో అతి పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ కి సీఎం అయ్యారు. ఇక ఒకసారి కాదు రెండుసార్లు పార్టీని గెలిపించారు. పాలనలో తనదైన శైలిని తీసుకుని వచ్చారు. బుల్డోజర్ తో అవినీతిని పెకిలించే సీఎం గా పేరు పడ్డారు. గ్యాంగ్ స్టర్స్ కన్నెర్ర అయ్యారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీలేని ధోరణితో దూకుడుగా వెళ్ళారు.

బీసీలు ఇతర బడుగులు అధికంగా ఉన్న చోట మైనారిటీల రాజకీయ పలుకుబడి బలంగా ఉన్న చోట ఒక అగ్ర వర్ణ సీఎం అందునా హిందూత్వ భావజాలం కలిగిన బీజేపీ నుంచి వచ్చి ఏకంగా పదేళ్ళ పాటు సీఎం గా చేయడం అంటే మాటలు కాదు. పైగా ఆయనకు మంత్రిగా కూడా అనుభవం లేదు. సీఎం కాకముందు ఎంపీగా పనిచేశారు అంతే.

ఆయనే యోగీ ఆదిత్యనాథ్. రీసెంట్ గా ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళ నిర్వహించి మరీ అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక జాతరను సక్సెస్ ఫుల్ గా నిర్వహించడం ఆయనకే చెల్లింది. ఏకంగా 70 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెద్దగా వివాదాలు లేకుండా నిర్వహించిన యోగీ ఆదిత్యనాథ్ దేశంలో కీలక నేతగా ఉన్నారు.

మరీ ముఖ్యంగా బీజేపీలో ఆయన ప్లేస్ ఏది అంటే ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత అని చెబుతారు. నరేంద్ర మోడీ కనుక తప్పుకుంటే బీజేపీలో హిందూత్వ భావజాలంతో మోడీ కంటే ఎక్కువ రెట్లు పార్టీని ముందుకు తీసుకునిపోయే సత్తా యోగీకే ఉందని అంతా నమ్ముతారు.

ఇదిలా ఉంటే యోగీ ఆదిత్యనాథ్ తాజాగా ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్నారు. ఆయన మీద అనేక ప్రశ్నలను యాంకర్ సంధించినపుడు కూల్ గానే జవాబు చెప్పారు. రాజకీయంగా కీలకమైన ప్రశ్నలు వేసినపుడు తడబాటు పడకుండానే ఆయన జవాబు చెప్పడం విశేషం.

ఇంతకీ ఆయనను అడిగిన క్లిష్ట ప్రశ్న ఏంటి అంటే మోడీ వారసుడు మీరే కదా అని. దానిని ఆదిత్యనాథ్ జవాబు చూస్తే సంచలనంగానే ఉంది. తాను ఎవరికీ వారసుడిని కాదు అని ఆయన చెప్పేశారు. అంతే కాదు తాను గోరఖ్ పూర్ మఠం నుంచి వచ్చాను మళ్ళీ తాను అక్కడికే పోతాను అని తేల్చేశారు.

అంటే తాను అనుకున్న ప్రజా సేవ చేసిన తరువాత తిరిగి ఆధ్యాత్మికత వైపే మళ్ళాలన్నదే యోగీ ఆదిత్యనాథ్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. దాదాపుగా యాభై ఏళ్ళకు చేరువ అయిన ఈ యూపీ సీఎం కి రాజకీయాల పట్ల కంటే సమాజ సేవ పట్ల ఆసక్తి ఉంది.

అంతే కాదు సనాతన ధర్మం మీద అనురక్తి ఉంది. ఆయన వీర హిందూత్వ గా గుర్తింపు పొందారు. ఆయన సీఎంగా ఉండబట్టే బీజేపీకి యూపీలో పలుకుబడి బాగానే ఉంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సీట్లు తగ్గినా బీజేపీకి పట్టుందని ఉప ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.

ఒక చేత్తే ఎస్పీని మరో చేత్తో బీఎస్పీని నిలువరిస్తూ బీజేపీని బలోపేతం చేస్తున్న యోగీ ఎప్పటికైనా ఈ దేశానికి ప్రధాని అవుతారని కాషాయం పార్టీలో అత్యధికుల మాట. ఇక ఆరెస్సెస్ మద్దతు కూడా ఆయనకు ఉంది. ఈ దేశ ప్రధానులు అంతా యూపీ నుంచే ఎక్కువగా వచ్చారు. ఆ విధంగా చూసినా అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న యూపీ నుంచి యోగీ సీఎం కావడం అంటే అది కష్టమేనీ కాదు.

పైగా బీజేపీలో ఇమేజ్ ఉన్న నాయకుడు జనాకర్షణ కలిగిన నేతగా యోగీ ఉన్నారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన ఆయన నిస్వార్ధంగా ప్రజా సేవలో ఉన్నారు. కుటుంబం బంధాలు లేవు, అవినీతి లేదు, ఈ దేశంలోని ప్రజలకు ఇవే కావాల్సింది. బీజేపీ చేతిలో ఉన్న తురుపు ముక్క యోగీ ఆదిత్యనాథ్ అని అంటారు. అయితే ఆయన మాత్రం నేను మోడీకి వారసుడిని కాదు, ప్రధానిగా పోటీలో లేను అంటున్నారు.

కానీ రాజకీయాల్లో అనుకోనివే జరుగుతాయి. ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం యోగీ ఏ విధంగా యూపీ సీఎం అయ్యారో అదే విధంగా ఆయన ఈ దేశానికి ఏదో నాటికి ప్రధాని అవుతారని అంటున్నారు. ఇక ఆయన కూడా సుదీర్ఘ కాలం మోడీ మాదిరిగానే ప్రధాని పీఠం మీద ఉంటారని చెబుతున్నారు. ఎందుకంటే రాజకీయంగా చూస్తే ఆయన చాలా చిన్న వయసులో ఉన్నారు కాబట్టి.

ఇక జాతీయ స్థాయిలో బీజేపీలో చూసుకుంటే మోడీకి వారసుడిగా అమిత్ షా ఉంటారని అంటున్నారు. ఆయనే నంబర్ టూ గా ప్రభుత్వంలో పార్టీలో ఉన్నారు. అయితే యోగీ అవకాశాలను కొట్టిపారేయలేరు అని అంటున్నారు. ఇలాంటి చర్చల మధ్యనే యోగీ మాట్లాడిన మాటలు సంచలనం రేపుతున్నాయి.

Tags:    

Similar News