జగన్ కి మరో పరీక్ష పెడుతున్న కూటమి

ఈ క్రమంలో వైసీపీ ఇవన్నీ ఆలోచించి ముందుగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొనకుండా దూరం పాటించింది. అయినా సరే వైసీపీకి ఈ ఎన్నికల ఫలితాలు షాక్ అనే చెప్పాలి.;

Update: 2025-03-09 14:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పూర్తి అవుతోంది. ఈ తొమ్మిది నెలలలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని వైసీపీ విమర్శిస్తోంది. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో అపుడే వ్యతిరేకత మొదలైందని కూడా అంటోంది.

ఇక ఈవీఎంల వల్లనే తాము ఓటమి పాలు అయ్యాయని వైసీపీలో కొందరు నేతల నుంచి వచ్చిన మాట. అయితే వీటిని అన్నింటినీ పూర్వపక్షం చేస్తూ తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గుంటూరు క్రిష్ణా, అలాగే ఉభయ గోదావరి జిల్లాల సీట్లను కైవశం చేసుకుంది. అది కూడా భారీ మెజారిటీతో.

అంటే బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు పెట్టినా తాము గెలిచి తీరుతామని టీడీపీ అలా చాటి చెప్పినట్లు అయింది. అంతే కాదు కూటమి ప్రభుత్వం మీద ప్రజలలో ఆదరణ తగ్గిందని వ్యతిరేకత పెరిగిందని వైసీపీ చేస్తున్న ప్రచారం డొల్ల అని కూడా రుజువు చేసింది.

ఈ క్రమంలో వైసీపీ ఇవన్నీ ఆలోచించి ముందుగానే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొనకుండా దూరం పాటించింది. అయినా సరే వైసీపీకి ఈ ఎన్నికల ఫలితాలు షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ పాల్గొంటే కూడా గెలిచే సీన్ లేదని తేల్చేసే ఫలితాలుగా ఉన్నాయి.

దౌర్జన్యాలు అక్రమాలు చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచారు అని వైసీపీ నేతలు అంటున్నా అవి అంత పస ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఎపుడైనా గెలుపు మాత్రమే మాట్లాడుతుంది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆ గండం నుంచి వైసీపీ తప్పించుకుంది కానీ మరో అగ్ని పరీక్షను టీడీపీ కూటమి సర్కార్ వైసీపీ కోసం రెడీ చేసి పెడుతోంది.

ఏపీలో 2021లో మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. కానీ కొన్ని చోట్ల కోర్టు వివాదాల వల్ల ఆగినవి ఉన్నాయి. ఇపుడు వాటిని పరిష్కరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో ఎన్నికలు పెట్టేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం ఈ ఏడాది జూన్ లో ఏపీలో ఉన్న 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

అంటే ఈ ఎన్నికలు ఏపీవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల పరిధిలో జరుగుతాయి. ఒక విధంగా గ్రౌండ్ లెవెల్ లో జనాభిప్రాయాన్ని చెబుతాయి. మరి ఈ ఎన్నికలు కనుక జరిగితే వైసీపీ పోటీ చేస్తుందా లేదా అన్నది ప్రశ్న. ఆ ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక చిక్కు లేకపోతే మరో చిక్కు అన్నట్లుగా కూడా వైసీపీకి పరిస్థితి ఉండొచ్చు అంటున్నారు.

ఎందువల్ల అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం బలంగా ఉంది. ఒక వేళ వైసీపీ పోటీకి దిగినా అధికారంలో ఉన్న పార్టీకే అడ్వాంటేజెస్ ఉంటాయి. దాంతో పాటు కూటమి ప్రభుత్వం ఎటూ అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటుంది. వ్యూహాలు కూడా పవర్ ఫుల్ గా ఉంటాయి. పైగా టీడీపీ జనసేన బీజేపీ కలసి ఈ ఎన్నికలను ఎదుర్కొంటాయి.

మరి వైసీపీ కూటమి బలాన్ని బలగాన్ని తట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలవగలదా అన్నది చర్చ. అలా కాదు ఈ ఎన్నికల్లో కూడా దౌర్జన్యాలు చేస్తారు అక్రమాలు చేస్తారు అని పోటీ నుంచి తప్పుకుంటే వైసీపీకి రాజకీయ పార్టీగా కొత్త సవాళ్ళు ఎదురవుతాయని అంటున్నారు. పోటీ చేయకపోతే పార్టీ ఎందుకు అన్న ప్రశ్నలు కూటమి పెద్దలే వేసే అవకాశం ఉంటుంది.

అంతే కాదు వైసీపీ క్యాడర్ కూడా నిరుత్సాహంతో నీరుకారుంది. అదే విధంగా వైసీపీకి ఎటు చూసినా ఇరకాటంగానే మునిసిపల్ ఎన్నికలు ఉండబోతున్నాయని అంటున్నారు. ఇక ఈ ఎన్నికల్లో బహిష్కరణ అస్త్రాన్ని వాడినా 2026లో లోకల్ బాడీ ఎన్నికలు మొత్తం ఏపీవ్యాప్తంగా జరుగుతాయి. మరి ఆ ఎన్నికల్లో అయినా కూటమిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో వైసీపీ ఇప్పటి నుంచే తన క్యాడర్ ని బలోపేతం చేసుకుంటూ పార్టీని పటిష్టం చేసుకుంటూ గట్టిగా నిలబడితేనే తప్ప కూటమిని ఎదుర్కోలేదని అంటున్నారు.

Tags:    

Similar News