జగన్ లాగానే కేసీఆర్ కూడానా ?

ఏపీలో జగన్ చేసినట్లే తెలంగాణాలో కేసీఆర్ చేయబోతున్నారా అంటే ప్రస్తుతానికి అయితే అదే అనిపిస్తోంది అని అంటున్నారు.;

Update: 2025-03-09 17:30 GMT

ఏపీలో జగన్ చేసినట్లే తెలంగాణాలో కేసీఆర్ చేయబోతున్నారా అంటే ప్రస్తుతానికి అయితే అదే అనిపిస్తోంది అని అంటున్నారు. ఈ ఇద్దరికీ వయసులో రాజకీయ అనుభవంలో తేడా ఉండొచ్చు కానీ ఆలోచనలు వ్యూహాలు ప్రత్యర్ధుల విషయంలో వారి విధానాల విషయంలో కొన్ని పోలికలు ఉంటాయని అంటున్నారు.

ఈ ఇద్దరూ ఒక పట్టాన రాజీపడరు. తాము అనుకున్నదే చేస్తారు. తమకు ఉన్న ప్రజా బలం మీద అపారమైన నమ్మకం. అదే విధంగా విపక్ష పాత్ర పోషించాలంటే ఇద్దరికీ అంతగా ఇష్టం ఉండటం లేదని అంటున్నారు. తెలంగాణాలో చూసుకుంటే మాజీ సీఎం కేసీఆర్ గత ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాలలో ఒకసారి మెరిసారు. ఆ తరువాత ఆయన మళ్ళీ రాలేదు.

ఈ మధ్యలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా తెలంగాణా అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం జరిపినా కేసీఆర్ హాజరు కాలేదు. మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కొన్నాళ్ళ పాటు మంత్రిగా కేసీఆర్ పనిచేశారు. ఆయన ప్రధానిగా ఉండగానే తెలంగాణా రాష్ట్రం వచ్చింది. అందుకేనా ఆయన వస్తారు అనుకున్నా హాజరు కాలేదు. స్పీకర్ స్వయంగా రమ్మని ఫోన్ లో కోరినా రాలేదు.

ఇక ఇపుడు చూస్తే ఈ నెల 12 నుంచి తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా అంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే రావచ్చు అని అంటున్నారు. కేసీఅర్ గత ఏడాది చేసినట్లుగానే సభకు ఒక రోజు వచ్చి కొంత సేపు కూర్చుని ఆ మీదట ఆయన మీడియా పాయింట్ వద్ద తాను చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు అని అంటున్నారు

నిజానికి కేసీఅర్ సభకు హాజరు కావాలని అధికార కాంగ్రెస్ కోరుతోంది. ఆయన పదేళ్ళ పాలన తీరుని సభలోనే ఎండగడతామని అంటోంది. కేసీఆర్ కూడా సమాధానం చెప్పుకోవచ్చని అంటోంది. అయితే కేసీఆర్ మాత్రం రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్న సభలో హాజరు కాకూడని భావిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా తనను నేరుగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూంటే సభలో ఉండాల్సిన అవసరం ఉందా అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కనుక ఏపీలో జగన్ కూడా బడ్జెట్ సెషన్ లో ఒక్క రోజే హాజరు అయి సభ నుంచి వెళ్ళిపోయారు. ఆయన కూడా గత ఏడాది ఇదే విధంగా చేశారు. జగన్ కూడా సభలో ఉండేందుకు ఇష్టపడటం లేదు. జగన్ సభకు వస్తే ఆయన అయిదేళ్ళ పాలన మీద ఎండగట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. కానీ జగన్ వారికి ఆ చాన్స్ ఇవ్వడంలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు అని అంటున్నారు.

ఆ హోదా ఎటూ ఇవ్వరనే తెలిసి ఆయన ఈ మెలిక పెట్టారని అంటున్నారు. ఇలా జగన్ సభకు హాజరు కాకపోవడానికి తప్పు అంతా అధికార కూటమి మీదనే పెడుతున్నారు. కానీ తాము అలా ఇవ్వలేమని అధికార పార్టీ చెబుతోంది. సో జగన్ కూడా విపక్షంలో కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

కేసీఆర్ విషయం తీసుకుంటే ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే ఉంది. కానీ ఆయన సభకు రావడం లేదు. తనకంటే వయసులో చిన్న వారు అయిన రేవంత్ రెడ్డి సభలో ఉండడం తనను కాంగ్రెస్ నాయకులు లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తారని ఆలోచించే తప్పుకుంటున్నారని చెబుతున్నారు. ఇవన్నీ చూస్తూంటే కేసీఅర్ జగన్ ఒకే విధమైన ఆలోచనలతోనే ప్రయాణం చేస్తున్నారు అని అంటున్నారు. తెలుగునాట రెండు చోట్లా ప్రధాన ప్రతిపక్ష నాయకులు లేకుండా సభలు జరుగుతున్నాయి. దాంతో చప్పగా ఉంటున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News