కాపు వృద్ధ నేత రగిలిపోతున్నారా ?

ఆయన రాజకీయ అనుభవం అర్ధ శతాబ్దం పైమాటే. రాజకీయంగా అనేక యుద్ధాలలో ఆరితేరిన వారు ఆయన. మంత్రిగా ఎంపీగా అనేక పదవులు చేపట్టిన నేతగా గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా ఆయన ఉన్నారు.;

Update: 2025-03-09 16:30 GMT

ఆయన రాజకీయ అనుభవం అర్ధ శతాబ్దం పైమాటే. రాజకీయంగా అనేక యుద్ధాలలో ఆరితేరిన వారు ఆయన. మంత్రిగా ఎంపీగా అనేక పదవులు చేపట్టిన నేతగా గోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారుగా ఆయన ఉన్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే చేగొండి హరిరామజోగయ్య. ఆయన కొత్త పార్టీ ఎవరు పెట్టినా అందులో ఉంటారు. తన అనుభవంతో సలహాలు ఇస్తారు. వారు స్వీకరించకపోతే ఆ వెంటనే ఆగ్రహంతో బయటకు వచ్చేస్తారు.

ఆయన రాజకీయం 1970 దశకం నుంచే మొదలైంది. కాంగ్రెస్ లో నుంచి ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి టీడీపీ లోకి వచ్చారు. ఎన్టీఆర్ కేబినెట్ లో హోం మంత్రిగా చేశారు. ఆ తరువాత ప్రజారాజ్యం, వైసీపీ జనసేన ఇలా అన్ని పార్టీలలో ఆయన కనిపించారు. ఇదిలా ఉంటే ఆయన పవన్ కళ్యాణ్ కి వెన్నుదన్నుగా నిలిచి భీష్మాచార్యునిగా అనేక సలహాలు ఇచ్చారు. జనసేన ఎలా ఎదగాలో కూడా సూచనలు ఇచ్చారు. కాపుల కోసం గట్టిగా ఆ పార్టీ నిలబడాలని కోరుకున్నారు.

ఇవన్నీ పక్కన పెడితే కాపుల నుంచి పవన్ కళ్యాణ్ సీఎం కావాలని బలంగా కోరుకున్న వారిలో హరిరామజోగయ్య ఒకరు. కాపులకు ఇప్పటికీ సీఎం పదవి అందని పండుగా మారింది. అందుకే ఆయన జనసేన టీడీపీ పొత్తులో భాగంగా అహికారంలో వాటా కోరాలని డిమాండ్ చేశారు. సీఎం పదవి షేరింగ్ జరగాలని కోరుకున్నారు.

ఇదిలా ఉంటే 21 సీట్లు మాత్రమే జనసేన తీసుకోవడం పైన ఒక దశలో ఆయన ఆక్షేపించారు. మొత్తానికి ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాపుల కోసం కూటమి ప్రభుత్వం మేలు చేయాలని జోగయ్య కోరుకున్నారు. కాపులను బీసీలలో చేర్చకపోతే పోయే. ఈబీసీలో వారికి పది శాతంలో అయిదు శాతం వాటా ఇవ్వాలని ఆ విధంగా కొత్తగా ఉత్తర్వులు జారీ చేయించాలని ఆ మధ్యన పవన్ కి కూటమి పెద్దలకు లేఖలు రాశారు.

గోదావరి జిల్లాల అభివృద్ధిని చేపట్టాలని, అలాగే నరసాపురం కోటిపల్లి రైవే లైన్ వేయాలని, కోనసీమలో పెట్రోలియం అనుసంధాన పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాజమండ్రి ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ హోదా ఇవ్వాలని గోదావరి జిల్లాలలో టెంపుల్ టూరిజాన్ని అభివృధి చేయాలని నరసాపురం మచిలీపట్నం వరకూ కొత్త రైల్వే లైన్ నిర్మించాలని కూడా జోగయ్య తన లేఖల ద్వారా కోరారు.

అదే విధంగా కాపులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ఆకాంక్షించారు. అయితే అవేమీ జరగలేదు. అసలు జోగయ్య రాసిన లేఖలకు పవన్ నుంచి కూడా స్పందన రాలేదని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాలను చూసిన మీదట జోగయ్య అసంతృప్తితో రగిలిపోతున్నారని అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినా కాపుల్కు న్యాయం జరగడం లేదని ఆయన తన సన్నిహితులతో అంటున్నట్లుగా చెబుతున్నారు

కాపు యువతకు ఉద్యోగ విద్యా రంగాల్లో రిజర్వేషన్లు కావాలన్నది జోగయ్య డిమాండుగా ఉంది. కానీ అది కూటమి ప్రభుత్వ హయాంలో నెరవేరడం లేదు. దాంతో ఆయన అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. లేఖలు రాసినా రెస్పాండ్ అవడంలేదని అందువల్ల వాటిని రాయడం కూడా వృధానే అని భావించి దూరంగా ఉన్నారని అంటున్నారు.

ఏది ఏమైనా కాపుల కోసం గోదావరి జిల్లాల అభివృద్ధి కోసం నిరంతరం పరిశ్రమించే జోగయ్య లాంటి వృద్ధ నేత కూటమి ప్రభుత్వం తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని అంటే ఆలోచించుకోవాలని అంటున్నారు. పెద్దాయన చెప్పినవి మంచి విషయాలే కాబట్టి వాటిని సానుకూలంగా ఆలోచించాలని కోరుతున్నారు. ఇక జోగయ్య మీడియా ముందుకు కూడా రావడం లేదు. కానీ ఆయన ఏదో నాడు లేఖ రూపంలోనో లేక మరో రూపంలోనో తన ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే అది రాజకీయంగా సామాజికపరంగానూ భారీ ప్రకంపనలు సృష్టిస్తుందని అంటున్నారు.

Tags:    

Similar News