బెదిరింపులు-నిరసనలు.. నేతల తీరుతో కూటమికి ఇబ్బందే!
టీడీపీలో రెండు రోజుల కిందట నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారం ఇంకా సమసిపోలేదు.;
ఏపీలోని కూటమి సర్కారులో పాలు పంచుకుంటున్న పార్టీల నాయకుల తీరు తలకో భిన్నంగా ఉంది. కొందరు నాయకులు వ్యక్తిగత ఇగోలకు ప్రాధాన్యం ఇస్తూ.. పార్టీలను రోడ్డుకులాగుతున్న పరిస్థితి కనిపి స్తోంది. ఇటు టీడీపీలోనూ.. అటు జనసేనలోనూ నాయకుల పనితీరు, వారు వ్యవహరిస్తున్నతీరు కూడా రెండు పార్టీలకు ఇబ్బందిగా మారుతోంది. టీడీపీలో రెండు రోజుల కిందట నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు వ్యవహారం ఇంకా సమసిపోలేదు.
తను చెప్పిన వారికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. అరవింద బాబు.. హల్చల్ చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. నేరుగా ఎక్సైజ్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లి నేలపై పడుకుని నిరసన వ్యక్తం చేయడం, దూషించడం వంటివి మీడియా చానెళ్లు సహా.. సోషల్ మీడి యాలో పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. దీనిని సరిచేసేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నుంచి సంజాయిషీ కోరారు. కానీ, గంటలు గడిచినా.. రోజులు దాటినా.. అరవిందబాబు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
ఇక, జనసేనలోనూ కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరు పార్టీకి శాపంగా మారింది. నియోజకవర్గాల స్థాయిలో చక్రం తిప్పుతున్న కొందరు నేతలు.. తమ హవా ప్రదర్శిస్తున్నారు. ఇది పార్టీకి మంచి పేరు తీసుకురాకపోగా.. ఉన్న పేరును చెడగొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడుకు చెందిన జనసేన కీలక నాయకుడు వరుపుల తమ్మయ్య బాబు.. తాజాగా వివాదానికి కేంద్రంగా మారారు. ఓ వ్యక్తి వైద్యం కోసం స్థానిక పీహెచ్‌సీకి వెళ్లగా.. ఆయనకు ముందుగా వైద్యం చేయాలని తమ్మయ్య డాక్టర్‌ను ఫోనులో ఆదేశించారు.
అయితే.. తమ్మయ్య ఎవరో తెలియదని.. అందరితో పాటే వైద్యం చేస్తానని వైద్యురాలు ఫోన్‌లో సమాధానం ఇచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తమ్మయ్య బాబు... నేరుగా ఆసుపత్రికి వైద్యురాలిని దూషిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏక వచనంతో ఆమెపై విరుచుకుపడ్డారు. దీంతో వైద్య సిబ్బంది హడలి పోయారు. అంతేకాదు.. తమ్మయ్య చేసిన పనికి వారు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.