10వ నెలలోకి కూటమి... సంతృప్తి పాళ్లెన్ని ..!
ఈ నేపథ్యంలో ఈ 9 నెలల కాలంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రభుత్వం పరంగా ప్రజల్లో ఉన్న సంతృప్తిని చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు;
ఏపీలో కూటమి సర్కారు ఏర్పడి మరో రెండు రోజుల్లో 9 నెలలు పూర్తి కానున్నాయి. జూన్ 12న నాలుగో సారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు 9 మాసాలు పూర్తవుతు న్నాయి. ఈ నేపథ్యంలో ఈ 9 నెలల కాలంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రభుత్వం పరంగా ప్రజల్లో ఉన్న సంతృప్తిని చంద్రబాబు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు పాలన సాగిస్తూనే మరోవైపు.. ప్రజల సంతృప్తిని కూడా లెక్కించుకుంటున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు దగ్గరకు చేరినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రజల సంతృప్తి మిశ్రమంగానే ఉంది. పింఛన్లు అందుకుంటున్న వారు సంతోషంగానేఉండగా.. కొత్తగా పించన్లు రాని వారు వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక, కొత్త రేషన్ కార్డులు కోరుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో వీరు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు వర్గాలు మిశ్రమ స్థాయిలోనే స్పందించినట్టు తెలుస్తోంది.
ఇక, నిరుద్యోగుల సమస్యలు అలానే ఉన్నాయి. ఉద్యోగుల పనితీరు బాగుందని చంద్రబాబు పైకి చెబుతు న్నా.. అంతర్గతంగా ఆయన అసంతృప్తితో ఉన్నారన్న చర్చ ఉంది. ఇంకా, వైసీపీ వాసనలు పోని ఉన్న తాధికారులు తమ పనితీరును ఏమాత్రం మార్చుకోలేదన్న ఆవేదన మంత్రుల స్థాయిలోనే వినిపిస్తోంది. మంత్రులు చెప్పింది చేయడం లేదన్న విమర్శలు వున్నాయి. ఇక, ప్రజలు కూడా అధికారుల పనితీరుపై దాదాపు ఇదేఅభిప్రాయంతో ఉన్నట్టు చంద్రబాబుకు నివేదికలు అందాయి.
అయితే.. ఇప్పటికిప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకలేదని.. మరికొన్నాళ్లు వేచి చూసే ధోరణిని అవలం బిస్తున్నారని సర్వే చెబుతున్నట్టు తెలిసింది. ఇక, ఎమ్మెల్యేల్లో చాలా తక్కువ మంది మాత్రమే ప్రజలకు చేరువవుతున్నారు. వీరిలో ఎక్కువమంది ప్రజలను కాకుండా.. సొంత పనులు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని.. ప్రజలకు, పార్టీకి కూడా దూరంగా ఉంటున్నారని దీనివల్ల మైనస్ ఏర్పడుతోందని సర్వే చెబుతోంది. సో.. మొత్తంగా 9 మాసాల్లో ప్రజల్లో పెద్దగా అసంతృప్తి లేకున్నా.. ఆ తరహా ఆనవాళ్లు అయితే.. కనిపిస్తున్నాయని అంటున్నారు. దీనిని సరిచేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు.