రాములమ్మ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. 15 ఏళ్ల తర్వాత చట్ట సభలోకి
తెలంగాణలో కాంగ్రెస్ ఖరారు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకప్పటి సినీ లేడీ సూపర్ స్టార్, మాజీ ఎంపీ విజయశాంతి పేరుంది.;
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి.. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి.. బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి.. పదేళ్లుగా రాజకీయాల్లో అటుఇటు మారుతూ వచ్చిన రాములమ్మను ఎట్టకేలను లక్ వరించింది. చాలాసార్లు దోబూచులాడిన అవకాశం చివరకు వరించింది. తెలంగాణలో కాంగ్రెస్ ఖరారు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒకప్పటి సినీ లేడీ సూపర్ స్టార్, మాజీ ఎంపీ విజయశాంతి పేరుంది.
తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో ఒకదానికి మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. అధికార కాంగ్రెస్ కు మూడు దక్కుతున్నాయి. వీటికి అభ్యర్థులను కాగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదివారం సాయంత్రం ఖరారు చేసింది.
విజయశాంతితో పాటు అసెంబ్లీ ఎన్నికల టికెట్ దక్కినట్లే దక్కి చేజారిన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.
ఎమ్మెల్యేల కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సోమవారం లోగా నామినేషన్లు వేయాలి. కాంగ్రెస్ కు మూడు, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కుతాయి.
తెలంగాణ తెచ్చిన ఎంపీగా..
2009 ఎన్నికల్లో మెదక్ నుంచి తొలిసారి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన విజయశాంతి మళ్లీ చట్ట సభల్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తెలంగాణ ఏర్పాటు సమయంలో బీఆర్ఎస్ కు ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరు కేసీఆర్ కాగా మరొకరు విజయశాంతి. తెలంగాణ ఏర్పాటుకు ముందే బీఆర్ఎస్ కు దూరమైన విజయశాంతి ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లారు. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 లో జరిగిన ఎన్నికల ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మరోసారి చట్ట సభకు వెళ్తున్నారు.