పవన్ కళ్యాణ్ ను మేం సీఎం చేసి తీరుతాం: అంబటి రాయుడు
అక్కడ ఏ పదవి లభించకపోవడంతో అనంతరం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జనసేన కోసమే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.;
ప్రముఖ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ ను వదిలేసిన తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ఆయన్ను కలిసి వైసీపీలో చేరారు. అక్కడ ఏ పదవి లభించకపోవడంతో అనంతరం జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం జనసేన కోసమే ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాయుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొన్ని నెలలు మౌనంగా ఉన్న రాయుడు, మళ్లీ తన రాజకీయ వ్యాఖ్యలతో ఇప్పుడు కలకలం రేపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాయుడు హాట్ కామెంట్స్ చేశాడు.
రాయుడు మాట్లాడుతూ.. ఏ రాజకీయ పరిస్థితులైనా పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి తాను ప్రయత్నిస్తానని రాయుడు అన్నారు. “నా ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి. దీని కోసం పూర్తి కృషి మేము చేస్తాం. పవన్ సీఎం అవుతారు. ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా అవుతారు. మేము దగ్గర ఉండి చేస్తాం. దగ్గరుండి చేపిస్తాం. నేను కూడా కృషి చేస్తాను. అదేంటి అంటే అదొక సిద్ధాంతం. ఎందుకు కాకూడదు” అని ఓ పోడ్‌కాస్టర్‌తో సంభాషణలో రాయుడు సంచలన కామెంట్స్ చేశారు.
అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం గల సీనియర్ నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవసరమని.. ఆయనే వచ్చే పదేళ్లు సీఎంగా కొనసాగుతారని పలుమార్లు చెప్తూనే ఉన్నారు. చంద్రబాబు ప్రాముఖ్యత కొనసాగినంత కాలం ఆయనే సీఎం అభ్యర్థి అని పవన్ స్పష్టంగా తెలిపారు.
అయితే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకునే అనేక మంది మద్దతుదారులు ఉండటం సహజమే. రాయుడు తాజా వ్యాఖ్యలు కూడా అదే కోవలోనే ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. మరి పవన్ ఫ్యాన్స్, జనసైనికులు కూడా కొద్దిరోజులుగా ఇదే కోరుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంత వరకూ జనసేనలో ప్రభావం చూపిస్తాయన్నది వేచిచూడాలి.