సిక్కోలు, అమరావతికి ఎయిర్ పోర్టు చంద్రబాబు మాస్టర్ ప్లాన్
అయితే రాజధానికి కాస్త దూరంలో ఉన్న గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్నే రాజధానికి వాడుకోవాలని తొలుత భావించారు.;
రాష్ట్రంలో ఎయిర్ కనెక్టవిటీ పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పార్టీకే చెందిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు కేంద్ర విమానయానశాఖ మంత్రిగా ఉండటంతో తన ఆలోచనలకు కార్యరూపం తీసుకువస్తున్నారు. ఇప్పటికే భోగాపురంలో అంతర్జాతీయ విమానశ్రయ పనులు చేస్తుండగా, కుప్పం, ఓర్వకల్లులోనూ విమానశ్రయాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీటికి అదనంగా కొత్తగా శ్రీకాకుళం, రాజధాని అమరావతిల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు సన్నాహాలు మొదలయ్యాయి. దీంతో ఎయిర్ కనెక్టవిటీపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. నవ నగరాల కాన్సెప్ట్ తో ఓ ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్న ప్రభుత్వం కొత్త రాజధానికి అన్నిరకాల రవాణా మార్గాలు ఉండాలని భావిస్తోంది. అయితే రాజధానికి కాస్త దూరంలో ఉన్న గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్నే రాజధానికి వాడుకోవాలని తొలుత భావించారు. అయితే ఈ విమానశ్రయం రాజధాని ప్రాంతానికి 30 కిలోమీటర్లు దూరం ఉండటంతో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో రాజధాని ప్రాంతంలోనే కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారు. అదేవిధంగా రాష్ట్రానికి ఓ మూలన ఉండే శ్రీకాకుళం జిల్లాలోనూ ఎయిర్ పోర్టు నిర్మిస్తే తీర ప్రాంత అభివృద్ధితోపాటు టూరిజం రంగం పుంజుకుంటుందని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ముఖ్యంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పక్కనే ఒడిశా రాష్ట్ర వాసులకు ఈ ఎయిర్ పోర్టు ఉపయోగపడుతుందని సర్కారు ఆలోచిస్తోంది.
దీంతో శ్రీకాకుళం, అమరావతిల్లో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రెండు చోట్ల విమానాశ్రయాలు నిర్మాణానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు సాంకేతిక, ఆర్థికపరమైన లోటుపాట్లు తెలుసుకోవాలని భావించింది. ఇందుకోసం నివేదిక తయారు చేసేందుకు అవసరమైన కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 21లోగా ఆన్ లైన్ లో టెండర్లు దాఖలు చేయాలని రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 24 టెక్నికల్ బిడ్స్, 27న ఫైనాన్సియల్ బిడ్స్ తెరవనున్నారు. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ఏ ప్రాంతం అవసరమో కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని నిబంధనల్లో స్పష్టం చేసింది.
శ్రీకాకుళం జిల్లాలో నిర్మించనున్న విమానాశ్రయాన్ని శ్రీకాకుళం నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని ఈశాన్య దిశలో సముద్ర తీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి, పక్కనే ఉన్న పలాస నియోజకవర్గాల మధ్య విమానశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. టెక్కలి గ్రానైట్ వ్యాపారానికి, పలాస జీడిపప్పు వ్యాపారానికి ప్రసిద్ధి. అంతేకాకుండా ఈ రెండు నియోజకవర్గాలతోపాటు ఆ పక్కనే ఉండే ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సముద్ర ఉత్పత్తులు లభ్యమవుతాయి.
దీంతో ఆ ప్రాంతంలో విమానాశ్రయం నిర్మిస్తే కలిగే లాభనష్టాలపై నివేదిక ఇవ్వాలని కన్సల్టెన్సీ సంస్థలను ప్రభుత్వం కోరుతోంది. భవిష్యత్తు అవసరాలను గుర్తించి 35 ఏళ్లకు సరిపడా రన్ వేల నిర్మించేలా మాస్టర్ ప్లాన్ ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఎయిర్ క్రాప్ట్ పార్కింగు స్టాండులు ఎన్ని ఉండాలి? ప్యాసింజర్, కార్గో టెర్మినళ్లు ఎలా ఉండాలి? అనే అంశాలపైనా నివేదిక ఇవ్వాలని కోరింది. విమానాశ్రయాలకు ఎంత భూమి అవసరం, ఇతర మార్గాల్లో ఆదాయం వచ్చేందుకు ఎంత భూమి అవసరం? తదితర సమస్త సమాచారం కన్సల్టెన్సీలు సూచించాల్సివుంటుంది.