ఫస్ట్ ప్లేస్: ఏపీలో బీపీ కేసులు కోనసీమ జిల్లా.. షుగర్ లో క్రిష్ణా

ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా కుటుంబ సభ్యుల వివరాల్ని సేకరించి.. పరీక్షలు చేస్తున్నారు.;

Update: 2025-03-09 07:30 GMT

ఏపీలో బీపీ పేషెంట్లు.. షుగర్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు వీలుగా ఏపీలో మూడు సర్వేలు నిర్వహిస్తున్నారు. బీపీ.. షుగర్.. క్యాన్సర్ కు సంబంధించి ఏపీలో ఎంత మందిఇబ్బంది పడుతున్న వైనాన్ని గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఈ సర్వేల్లో రెండు సర్వేల ఫలితాలు వెలుగు చూశాయి. అందులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి.

ఈ రిపోర్టు ప్రకారం ఏపీలో 14.73 శాతం మంది బీపీతో.. 11.78 శాతం మంది షుగర్ తోనూ బాధ పడుతున్నట్లుగా గుర్తించారు. బీపీలో కోనసీమ జిల్లా మొదటిస్థానంలో ఉండగా.. షుగర్ వ్యాధిలో క్రిష్ణా జిల్లా మొదటి స్థానంలో ఉన్నట్లుగా గుర్తించారు. రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన వారు 4.09 కోట్ల మంది ఉండగా.. వీరి నుంచి సేకరించిన సమాచారంతో ఈ వివరాలు బయటకు వచ్చాయి.

ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా కుటుంబ సభ్యుల వివరాల్ని సేకరించి.. పరీక్షలు చేస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని స్థానిక వైద్యాధికారి మరోసారి టెస్టులు చేసి నిర్దారిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన సర్వేలో బీపీ.. షుగర్ కేసులు అధికంగా కోస్తా జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గిరిజనులు ఎక్కువగా ఉండే అల్లూరి సీతారామరాజు.. పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలు ఈ ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు.

ఉప్పు తక్కువగా తినేవారు.. శారీరక శ్రమ ఎక్కువగా చేసే ప్రజలు ఉన్న జిల్లాల్లో అనారోగ్య సమస్యలుతక్కువగా నమోదవుతున్నట్లుగా తేల్చారు. బీపీ ఎక్కువగా ఉన్న 5 జిల్లాల్లో కోనసీమ 19.3 శాతం.. క్రిష్ణా 18.5 శాతం.. పశ్చిమగోదావరి జిల్లా 18.1 శాతం.. ఏలూరు జిల్లా 17.4 శాతం.. బాపట్ల జిల్లా 16.6 శాతం ఉండగా.. బీపీతో బాధ పడుతున్న వారు తక్కువగా ఉన్న జిల్లాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా 7.6 శాతం.. కర్నూలు 7.6 శాతం.. అనంతపురం 7.8 శాతం.. శ్రీసత్యసాయి 7.9 శాతం.. పార్వతీపురం మన్యం 9.3 శాతం ఉన్నట్లుగా గుర్తించారు.

షుగర్ లో టాప్ ఐదు జిల్లాల విషయానికి వస్తే క్రిష్ణా జిల్లా 14.9 శాతం.. బాపట్ల జిల్లా14.2 వాతం.. గుంటూరు 14.3 శాతం.. పశ్చిమగోదావరి జిల్లా 14 శాతం మంది బాధ పడుతున్నట్లు గుర్తించారు. అదే సమయంలో అతి తక్కువ షుగర్ కేసులు నమోదైన జిల్లాల జాబితాలో అల్లూరి సీతారామరాజు జిల్లా 2.6 శాతం.. కర్నూలు జిల్లా 4.8 శాతం.. పార్వతీపురం మన్యం 5.4 శాతం.. సత్యసాయి జిల్లా 5.9 శాతం ఉన్నట్లుగా గుర్తించారు. క్యాన్సర్ తో బాధ పడుతున్న వారి సర్వే ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. మరికొద్ది వారాల్లోనే వెల్లడి కానున్నాయి.

Tags:    

Similar News