సింగర్ కల్పన వివాదం : మహిళా కమిషన్ వార్నింగ్

ఇటీవల నిద్ర మాత్రలు అధిక మోతాదులో తీసుకుని ఆస్పత్రిపాలైన ప్రముఖ గాయనీ కల్పన ప్రస్తుతం కోలుకున్నారు. అయితే తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులపై ఆమె తీవ్రంగా స్పందించారు.;

Update: 2025-03-09 10:14 GMT

ఇటీవల నిద్ర మాత్రలు అధిక మోతాదులో తీసుకుని ఆస్పత్రిపాలైన ప్రముఖ గాయనీ కల్పన ప్రస్తుతం కోలుకున్నారు. అయితే తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులపై ఆమె తీవ్రంగా స్పందించారు. తనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

కల్పన తనపై జరుగుతున్న తప్పుడు కథనాలను అడ్డుకోవాలని మహిళా కమిషన్‌ను కోరారు. వాస్తవాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అనేక యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆత్మహత్యాయత్నం చేశానంటూ దుష్ప్రచారం చేయడం తగదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ విషయమై శనివారం తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలుసుకుని ఫిర్యాదు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తన వీడియోలతో అసత్య ప్రచారం చేస్తున్నాయని, తన కుటుంబాన్ని ఈ తప్పుడు ప్రచారం ప్రభావితం చేసిందని తెలిపారు. ఈ మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నేరెళ్ల శారద హామీ ఇచ్చారు. మహిళలపై అసభ్యకరమైన పోస్టులు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, ట్రోలింగ్‌ విషయంలో నిఘా ఉంచి అవసరమైన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ హెచ్చరించింది.

-క్లారిటీ ఇచ్చిన కల్పన

తాను ఆత్మహత్యాయత్నం చేయలేదని సింగర్ కల్పన స్పష్టం చేశారు. నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలిపారు. ఈ విషయంపై కేపీహెచ్‌బీ పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. తన జీవితంలో ఎవరి ప్రమేయం లేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న వార్తలు అసత్యమని పేర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం కల్పన చెన్నైలో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు తెలిపారు. అతను వెంటనే కాలనీ ప్రతినిధులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతానికి ఆమె పూర్తిగా కోలుకున్నారు.

ఈ ఘటనలో అనవసరమైన వదంతులు ప్రచారం చేయడం బాధాకరమని, నిజమైన సమాచారం తెలుసుకోకుండా అసత్య వార్తలు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యంగా ఉందని ఆమె తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Tags:    

Similar News