కుప్పానికి బాబు సీఎం కాదు... అంతకు మించి !

నా మనుషులు నా వాళ్ళూ అంటూ ఆయన మదిలోని భావాలను మాటలలో ముఖాన నిండైన చిరునవ్వుతో సంపూర్ణంగా వ్యక్తం చేస్తూంటారు.

Update: 2025-01-07 05:30 GMT

ఢిల్లీకి రాజు అయినా తల్లికి కుమారుడే అన్న పాత సామెత ఉంది. అది నిజం కూడా. చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన తన సొంత ఊరు సొంత ప్రాంతం అంటే ఎక్కువగా ఎమోషనల్ అవుతారు. ఆలాంటి బాబు సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళినపుడు మామూలుగా ఉంటారా. ఎంతో భావోద్వేగంతో ఆయన కనిపిస్తారు.

నా మనుషులు నా వాళ్ళూ అంటూ ఆయన మదిలోని భావాలను మాటలలో ముఖాన నిండైన చిరునవ్వుతో సంపూర్ణంగా వ్యక్తం చేస్తూంటారు. ఆయనకు కుప్పంతో దాదాపుగా మూడున్నర దశాబ్దాల పైబడిన అనుబంధం. అక్కడ మొలిచిన చిగురాకు కొమ్మ కూడా బాబుకు పరిచయమే.

అక్కడ ప్రతీ ఇల్లూ ప్రతీ లోగిలీ బాబుకు చిర పరిచితమే.అందుకే ఆయన సొంత ఇంటికి వెళ్ళినట్లుగా వెళ్తారు. తాజా కుప్పం పర్యటనలోనూ ఆయన అదే చేశారు. ఆయన కొన్ని ఇళ్ళకు వెళ్లారు. అక్కడ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.

వారితో కలసి అల్పాహారం స్వీకరించారు. ఇంటి ఆడపడుచులతో ముచ్చటించారు. ఇంటి పెద్ద భుజం మీద చేయి వేసి మరీ కుటుంబం మొత్తం సభ్యులు అందరితో గ్రూప్ ఫోటో దిగారు. ఇక బాబు తన ఇంటికి రావడం పట్ల ఆ కుటుంబాలు అయితే ఎంతో సంతోషించాయి. బాబుని చూస్తూ ఆయంతో మాట్లాడుతూ వారు చెప్పలేని ఆనందమే పొందారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా తమ ఇంటికి వచ్చారు అన్నది వారికి ఒక షాక్ గా ఉంది. అయితే బాబు వారితో అన్నది మాత్రం వేరు. తాను ఏపీకి సీఎం అయినా కుప్పానికి ఎమ్మెల్యేను మాత్రమే. మీ అందరికీ నేను ఒక నాయకుడిగా కాకుండా కుటుంబ సభ్యుడిగా ఉండి అభివృద్ధిలో ముందుకు నడిపిస్తాను అని హామీ ఇచ్చారు.

కుప్పంలో ప్రతీ ఇంట్లో నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని బాబు మనసారా కోరుకున్నారు. మీ అందరి కోసం ప్రభుత్వం ఎంతో చేస్తుందని ఆయన చెప్పారు. కుప్పాన్ని తాను ఎంతగానో తీర్చిదిద్దానని అయినా ఇంకా చేయాల్సింది చాలా ఉందని బాబు అన్నారు.

కుప్పం ఏపీకే ఆదర్శంగా చేస్తాను అని ఆయన ప్రకటించారు తనను ఎనిమిది సార్లు అత్యధిక మెజరిటీతో గెలిపించిన కుప్పం ప్రజలు తనకు అత్యంత ఆప్తులు అని బాబు ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అవును నిజమే బాబు 1989లో యువకుడిగా ఉన్న టమిలో కుప్పంలో తొలిసారి పోటీ చేశారు. అలా ఆయన ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి రెండోసారి శాసనసభ్యుడిగా వెళ్లారు.

అది లగాయితూ 2024 దాకా బాబు గెలుస్తూనే ఉన్నారు. కుప్పం ప్రజలు ఏ పార్టీ నేతలు వచ్చినా ఎవరెన్ని మాటలు చెప్పినా బాబుకే జై కొడతారు. వై నాట్ కుప్పం అని గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దలు టార్గెట్ చేసినా భారీ సభలను జనాలను తరలించి నిర్వహించినా జనాలు నిశ్శబ్దంగా ఓటు చేసి మరీ బాబుకే అత్యధిక మెజారిటీ ఇచ్చారు అంటే అది బాబుకు వారికి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధం అని అంటున్నారు.

అందుకే కుప్పం అంటే బాబుకు ప్రత్యేకమైన ప్రేమ. అలాగే మా బాబు సీఎం అని చెప్పుకోవడం కంటే మరేమి ఆనందం ఉంటుంది అన్నది కుప్పం జనాల భావన. మొత్తానికి సీఎం గా నాలుగవ సారి ప్రమాణం చేసిన మీదట రెండు రోజుల పర్యటనకు వచ్చిన బాబుని పేదలు రైతులు మధ్యతరగతి వర్గాలతో పాటు విధ్యావంతులు విశ్వవిద్యాల విద్యార్ధులు ఇలా అంతా కలసి తమ ఆనందాన్ని ఆయంతో పంచుకున్నారు.

బాబు సైతం తన కోసం వచ్చిన వారిని ఎవరినీ నిరాశ పరచకుండా ఫోటోలు వారితో దిగుతూ వారి యోగ క్షేమాలను తెలుసుకుంటూ ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించారు. సంక్రాంతి ముందే తమ లోగిళ్ళకు బాబు సంక్రాంతిని తెచ్చారని కుప్పం జనాలు మురిసిపోతున్నారు అంటే బాబు ఏపీకి సీఎం కానీ కుప్పానికి అంతకు మించి అన్నది అర్ధమవుతోంది కదా అంటున్నారు.

Tags:    

Similar News