చంద్రబాబు అసలు మారరు.. మళ్లీ మళ్లీ అదే మాయలో..
ఎంతటి బలవంతుడుకైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత అధిగమించడమే ఆ బలవంతుడికి పెద్ద సవాల్.
ఎంతటి బలవంతుడుకైనా ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత అధిగమించడమే ఆ బలవంతుడికి పెద్ద సవాల్. తెలుగు రాజకీయాల్లో బాహుబలిగా చెప్పే ఏపీ సీఎం చంద్రబాబుకు కూడా ఓ బలహీనత ఉందట.. ఆ బలహీనతను అధిగమించడంలో చంద్రబాబు సదా విఫలమవుతూనే ఉంటారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒంటి చేత్తో రాజకీయాన్ని మలిచేస్తారని చెప్పే చంద్రబాబు.. ఇంకొకరి చేతిలో ఉన్న స్టీరింగ్ కు తగ్గట్టు తిరుగుతుంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన బ్యూరోక్రట్లు ఏం చెబితే అదే చేస్తారని అంటుంటారు. ప్రతిపక్షంలో ఉండగా కార్యకర్తల కష్టాన్ని నమ్ముకునే చంద్రబాబు చేతికి అధికారం చిక్కగానే మారిపోతారని ఆ పార్టీ కార్యకర్తలే విమర్శిస్తుంటారు. అయితే తనలో లోపాలను సరిదిద్దుకుంటానని, ఈ సారి పాలనతోపాటు రాజకీయాన్ని చేస్తానని ఆయన కార్యకర్తలను సముదాయిస్తుంటారు. కానీ, నిజానికి ప్రభుత్వంలో రాజకీయ కోణానికన్నా.. అధికారుల మాటకే ఎక్కువ విలువ ఇస్తుంటారని అంటుంటారు. దీనివల్ల ప్రజలకు, ఆయనకు నష్టం లేకపోయినా, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటారు. కానీ, తమ నేతను వారు వెనకేసుకునే వస్తారని చెబుతారు. అయితే తమ నేతలో ఓ మార్పును కోరుకుంటున్నా, ఆయన అది గుర్తించడం లేదని చెప్పుకుంటున్నారు.
చంద్రబాబు పాలనలో ఎప్పటికప్పుడు వినిపించే మాట సర్వే.. ప్రభుత్వ పాలన ఎలా ఉందో తెలుసుకోవడంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకునేందుకు తరచూ సర్వేలు చేయిస్తుంటారు సీఎం చంద్రబాబు. తనపై తాను కూడా సర్వే చేయించుకుని అవసరమైన మార్పులు చేసుకుంటారని చెబుతుంటారు. అయితే ఆయన వరకు ఏమో గానీ, మిగతా విషయాల్లో ఆయన చేయిస్తున్న సర్వేల ఫలితాలపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చేయించే ఏ సర్వే అయినా, గ్రౌండ్ రియాలిటీకి తగ్గట్టు ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ, సర్వే ఏజెన్సీలు ఫీల్ గుడ్ అనే రిజల్ట్ ఇవ్వడం వల్ల చివరికి బొక్కాబోర్లా పడుతున్నామని గత అనుభవాలను గుర్తు చేస్తున్నారు కార్యకర్తలు. అయినా చంద్రబాబు మారడం లేదని, సర్వేలపై నమ్మకాన్ని కోల్పోవడం లేదని అంటున్నారు.
1995లో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన నుంచి ఇప్పటివరకు ఇదే తంతు నడుస్తోందని చెబుతున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్ చేయించడం ప్రజలతో ఒకటి నొక్కండి, రెండు ఒత్తండి అని కోరడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని, ప్రజలు కూడా ఈ ఫోన్స్ కు విసిగిపోతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా కొందరు ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడితే ఏం ఇబ్బంది వస్తుందనే కారణంతో అంతా ఆల్ రైట్ అనేస్తున్నారని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఈ పరిణామాల కోసం తెలుసుకోని చంద్రబాబు.. తన చుట్టూ ఉండే అధికారులు చెప్పిన విషయాలకు మోసపోతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నేత ఆ మాయా లోకం నుంచి బయటపడితేగాని పరిస్థితిలో మార్పు రాదని, లేదంటే మళ్లీ మళ్లీ మోసపోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.