పరుగుల రాణితో చంద్రబాబు భేటీ.. ఇక్కడా 'అదే' చర్చ!
సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఏమైకు అందుకున్నా ఏపీలో పెట్టుబడులు.. అభివృద్ధి మంత్రాన్నే పఠిస్తున్నారు.;
సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా.. ఏమైకు అందుకున్నా ఏపీలో పెట్టుబడులు.. అభివృద్ధి మంత్రాన్నే పఠిస్తున్నారు. వేదిక ఏదైనా.. వ్యక్తులు ఎవరైనా తనను కలుస్తున్నవారిని ఏపీని అభివృద్ది చేద్దాం.. కలిసి రండి! అనే పిలుపు ఇస్తున్నారు. దీంతో చంద్రబాబు దూరదృష్టి, విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటికే చాలా మంది పెట్టుబడులకు ముందుకు వచ్చారు. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కూడా చేసుకున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పరుగుల రాణి పీటీ ఉష తాజాగా సీఎం చంద్రబాబును.. ఆమె ఉండవల్లిలోని నివా సంలో కలుసుకున్నారు. కేరళకు చెందిన ఉష.. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా(రాష్ట్రపతి కోటాలో) ఉన్నారు. అదేవిధంగా భారత ఒలింపిక్ సంఘం(ఐఓసీ) అధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. మర్యాద పూర్వకంగా కలుసుకునేందుకు వచ్చిన ఉష దగ్గర కూడా.. చంద్రబాబు రాష్ట్ర అభివృద్ది, క్రీడల శిక్షణ వంటి అంశాలనే ప్రస్తావించడం.. రాష్ట్రం పట్ల చంద్రబాబుకు ఉన్న అంకిత భావాన్ని చాటుతోందని మేధావులు చెబుతున్నారు.
సాధారణంగా.. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు.. శాలువాలు కప్పడం, మొమెంటోలు ఇవ్వడంతోనే సరిపుచ్చుతారు. కానీ, ప్రతి విషయంలోనూ అవకాశాన్ని వెతుక్కునే చంద్రబాబు.. తాజాగా ఉష దగ్గర కూడా.. ఏపీలో క్రీడల అభివృద్ధికి సంబంధించిన అంశాలనే ప్రస్తావించారు. నూతన క్రీడా విధానం, అథెట్లకు అధునాతణ శిక్షణపై చంద్రబాబు చర్చించారు. అంతేకాదు.. అమరావతిలో `నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్` ఏర్పాటుపైనా తన విజన్‌ను వివరించారు.
అలాగే.. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసేలా.. పీటి ఉష ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు కోరారు. స్పోర్ట్స్ సిటీగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న తన ప్రణాళికలను కూడా సీఎం వివరించారు. అన్నింటికీ మించి.. 2029లో జరగనున్న నేషనల్ గేమ్స్‌కు అమరావతిని వేదిక చేయాలన్న తన మనసులోని మాటను వెల్లడించారు. దీనికి సంపూర్ణంగా సహకరించాలని.. అవసరమైతే.. వచ్చే నెల నుంచి ఏర్పాట్లు చేయాలన్నా..తాము నిధులు కేటాయిస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం గమనార్హం.