మాది మూలధన వ్యయం.. వైసీపీది వ్యక్తిగత వ్యయం: పయ్యావుల
కానీ, వైసీపీ ఇదే పేరుతో వ్యక్తిగత వ్యయానికి ప్రజాధనాన్ని ఖర్చుచేసిందని విమర్శించారు.;
ఏపీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూల ధన వ్యయం(క్యాపిటల్ ఎక్స్ పెడించర్) గురించి మాట్లాడుతూ.. తాము మూల ధనవ్యయం అనే పదానికి నిర్దిష్ట అర్ధంలో నిధులు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. కానీ, వైసీపీ ఇదే పేరుతో వ్యక్తిగత వ్యయానికి ప్రజాధనాన్ని ఖర్చుచేసిందని విమర్శించారు. దీనిని మూల ధన వ్యయం ఎలా అంటారో తెలియదన్నారు.
మంత్రి ఏమన్నారంటే..
``గతంలో ఎన్నడూ లేని విధంగా క్యాపిటల్ ఎక్స్ పెడించర్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. క్యాపిటల్ ఎక్స్ పెడించర్ అంటే ఏంటనేది సామాన్యుని భాషలో చెప్పాలంటే.. ఒక రైతు భూమి కొనడం క్యాపిటల్ ఎక్స్ పెడించర్. ఆ భూమిని సాగు చేసుకోవడానికి అవసరమైన బావి తవ్వడం.. బోరు వేయడం క్యాపిటల్ ఎక్స్ పెడించర్. సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై ఖర్చు చేస్తే.. తిరిగి అవి ఆదాయాన్ని కల్పిస్తాయి. ఇదే నిజమైన మూలధన వ్యయ లక్ష్యం`` అని మంత్రి వివరించారు.
మూల ధన వ్యయానికి ప్రధాన ఉదాహరణ పట్టిసీమ ప్రాజెక్టేనని మంత్రి చెప్పారు. 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు ఈ రాష్ట్ర రైతాంగానికి ఐదేళ్లల్లో 44 వేల కోట్ల రూపాయలను సంపా దించే అవకాశాన్ని కల్పించిందని వివరించారు. అయితే.. వైసీపీ హయాంలో మూల ధన వ్యయం అంటే.. వందల కోట్లతో సముద్ర తీరాన ప్యాలెస్సులు(రుషి కొండపై) కట్టుకోవడంగా మార్చేశారని ఆక్షేపించారు.
అంతేకాదు.. సర్వే రాళ్లపై బొమ్మల(జగన్) కోసం రూ.650 కోట్లు తగలపెట్టారని.. కానీ ఇది.. ప్రజలకు ఉపయోగపడే క్యాపిటల్ ఎక్స్ పెడించర్ కాదని పయ్యావుల విమర్శించారు. ``ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్ పెడించరులా కన్పించే పర్సనల్ ఎక్స్ పెడించర్.`` అని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రంలో మూల ధన వ్యయం తరిగిపోయి.. ఉపాధి, ఉద్యోగాల కోసం.. ప్రజలు పొట్టచేతబట్టుకుని ఇతర ప్రాంతాలకు పోయారని అన్నారు.