ఉగాదికే ముహూర్తం.. కొత్త ఏడాదిలో మెగా బ్రదర్ కి పదవీయోగం?
మెగా బ్రదర్ నాగబాబుకు గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ తెలుగు సంవత్సరాదికి ఆయన మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మెగా బ్రదర్ నాగబాబుకు గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ తెలుగు సంవత్సరాదికి ఆయన మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు నాగబాబును మంత్రివర్గంలో చేర్చుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారంటున్నారు. ఈ ఉగాదికి మంత్రివర్గాన్ని విస్తరించి నాగబాబుకి ఇచ్చిన హామీని నెరవేరుస్తారని టాక్ వినిపిస్తోంది.
మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చట్టసభలో అడుగుపెట్టాలనే ఆయన కోరిక ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎన్నికల సమయంలో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీచేసి లోక్ సభలో అడుగుపెట్టాలని భావించిన నాగబాబు ఆశలకు బీజేపీ గండికొట్టింది. పొత్తుల్లో భాగంగా అనకాపల్లిని బీజేపీకి కేటాయించడంతో నాగబాబు పోటీకి దూరంగా ఉండిపోయారు. ఇక ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లాలని ఆశపడ్డారు.
గత ఏడాది జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో సీటు ఆశించారు నాగబాబు. మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే రెండు స్థానాల్లో రాజీనామా చేసిన వారినే తిరిగి ఎన్నుకోవాల్సివచ్చింది. మిగిలిన సీటును నాగబాబు కోరుకున్నారు. ఐతే టీడీపీలో ఆ సీటు కోసం తీవ్ర పోటీ ఉండటంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేసి రాష్ట్ర మంత్రివర్గంలో చేర్చుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఓకే అన్నారు. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ రావడంతో నాగబాబు ఎమ్మెల్సీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. జనసేనలో ఆయనకు ఎవరూ పోటీ లేకపోవడంతో నాగబాబు ఎమ్మెల్సీ అవడం దాదాపు ఖాయమంటున్నారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం నాగబాబు త్వరలో ఎమ్మెల్సీ అవ్వడం ఖాయమంటున్నారు. ఐదు ఖాళీల్లో జనసేన నుంచి నాగబాబు మండలిలో అడుగు పెట్టడం లాంఛనమే అని టాక్ వినిపిస్తోంది. అయితే ఆయన మంత్రిగా బాధ్యతలు ఎప్పుడు చేపడతారనేది ఆసక్తిరేపుతోంది. అయితే కూటమిలో జరుగుతున్న ప్రచారం ప్రకారం 20న ఎన్నికల ప్రక్రియ ముగియనుండగా, 30న తెలుగు సంవత్సరాది ఉగాది పండగ వస్తుంది. తెలుగువారికి ఉగాది సెంటిమెంటు ఎక్కువ కనుక.. ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే నాగబాబు ఒక్కరికే మంత్రి పదవి వస్తుందా? లేక ఒకటి రెండు రాజీనామాలు తీసుకుని ఆ మేరకు సీనియర్లతో సర్దుబాటు చేస్తారా? అనేది చర్చకు తావిస్తోంది.