ఏపీ బడ్జెట్ పై షర్మిల యతిప్రాసల రియాక్షన్!
ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా.. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు.
ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా.. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు. దీంతో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లయ్యింది. ఈ సమయంలో బడ్జెట్ లో కేటాయింపులపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవును... రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు.. మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు.. రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు.. ఇక, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేస్తూ నేడు అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో షర్మిల స్పందించారు.
ఇందులో భాగంగా... కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్.. సంఖ్య ఘనం - కేటాయింపులు శూన్యం అన్నట్లుగా ఉందని.. అంతా అంకెల గారడి - అభుత కల్పన అని.. దశ - దిశ లేని, పస లేనిదని షర్మిల విమర్శించారు. ఈ సందర్భంగా... సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారని.. ఎన్నికల వాగ్ధానాలను పూర్తిగా విస్మరించారని షర్మిల ఫైరయ్యారు.
ఈ సందర్భంగా.. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అనే విషయం తొలి బడ్జెట్ తోనే నిరూపితం అయ్యిందని చెప్పిన షర్మిల.. సుపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్ అని ఫైరయ్యారు. ఈ సందర్భంగా ప్రకటించిన బడ్జెట్ కేటాయింపులు.. వాస్తవంగా అవసరమైన మొత్తానికి సంబంధం లేదని చెబుతూ.. ఘణాంకాలతో సహా ఎక్స్ వేదికగా వివరించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా... అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురుచూస్తుంటే.. అందుకు రూ.11 వేల కోట్ల నిధులు కావాల్సి ఉంటే.. తాజా బడ్జెట్ లో ఆ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం అన్యాయమని.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుంటే.. ముష్టి రూ.300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహమే అని షర్మిల అన్నారు.
ఇక తల్లి వందనం పథకానికి కేటాయించిన నిధులపైనా షర్మిల మండిపడ్డారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులకు ఈ తల్లికి వంధనం పథకం కింద రూ.12,600 కోట్లు అవసరం అయితే.. కేవలం రూ.9,407 కోట్లు కేటాయించారని.. అంటే.. సుమారు మరో రూ.3వేల కోట్ల మేర విద్యార్థులను తగ్గించాలనుకున్నారా అంటూ ఆమె ప్రశ్నించారు.
దీపం-2 పథకానికి ఏడాదికి రూ.4,500 కోట్లు అవసరం అయితే.. ఈ ఉచిత సిలిండర్ల పథకానికి రూ.2,601 కోట్లు మాత్రమే కేటాయించారని.. అంటే.. కోటిన్నర మంది లబ్ధిదారుల్లో సగం మందికి కోత పెట్టదలచుకున్నారా అని ప్రశ్నించారు. నెలకు రూ.1,500 ఇచ్చే మహాశక్తి పథకాన్ని మాయం చేశారని.. ఫలితంగా, కోటిన్నర మంది మహిళలకు అన్యాయం చేశారని విమర్శించారు.
ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదని.. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ లో నెలకు రూ.350 కోట్లు ఈ పథకానికి కేటాయించడానికి ప్రభుత్వానికి మనసురాలేదని.. రూ.10 లక్షల వరకూ ఉచిత రుణాలు అని చెప్పి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా డ్వాక్రా మహిళలను మోసం చేశారని.. నిరుద్యోగభృతి టాపిక్కే లేదని షర్మిల పేర్కొన్నారు.
ఈ విధంగా... రాష్ట్రంలోని అన్ని కేటగిరీ ప్రజలనూ మోసం చేసిన ఈ బడ్జెట్ లో విజన్ లేదు, విజ్డమ్ లేదు, కేవలం ఇంద్రజాలమే ఉందని.. మిషన్ లేదు మీనింగ్ లేదు కేవలం మహేంద్రజాలమే అని షర్మిల దుయ్యబట్టారు.