మీరు మారాలి.. మళ్లీ సభకు రావాలి.. చంద్రబాబు సీరియస్ కామెంట్స్
టీడీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అసెంబ్లీకి రావాలి అంటే మీరు మారాలి.. పనితీరు మార్చుకోవాలంటూ సూచించారు
టీడీపీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అసెంబ్లీకి రావాలి అంటే మీరు మారాలి.. పనితీరు మార్చుకోవాలంటూ సూచించారు. బడ్జెట్ పై టీడీఎల్పీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నా మంచి బడ్జెట్ ను తీసుకువచ్చామని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత ఎంపీలు, ఎమ్మెల్యేదేనని చెప్పారు.
రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉన్నా మంచి బడ్జెట్ ను ప్రజలకు అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, టీడీపీ కూటమి పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఈ ఏడాది నుంచి తల్లికివందనం, అన్నదాతా సుఖీభవ పథకాలను ప్రజలకు అందిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మత్స్యకారుల వేట నిషేధ కాలంలో అందజేసే ఆర్థిక సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామన్నారు.
బీసీలకు ప్రాధాన్యమివ్వడంతోపాటు వారి రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యంగా బడ్జెట్ పై కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని చెప్పారు. మళ్లీ సభకు రావాలి.. అనే భావనతో ఎమ్మెల పనితీరు ఉండాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయంతో ఉండాలని సూచించారు. ఎక్కడా గ్రూపు తగాదాలను సహించేది లేదని హెచ్చరించారు.